సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్
Arvind Srinivas, Kamal Haasan
ప్రఖ్యాత నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్ హాసన్ ప్రస్తుతం సిలికాన్‌లోని AI-ఆధారిత రీసెర్చ్ సెంటర్ అయిన పెర్ప్లెక్సిటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిశారు.
భారతీయ సినిమా పరిశ్రమలో గత కొన్ని దశాబ్దాలుగా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, సినీ పరిశ్రమ ఎదుగుదలకు కృషి చేస్తున్న కమల్ హాసన్ ఇలా భవిష్యత్తుని శాసించబోతోన్న ఏఐ రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించడంతో మరిన్ని విప్లవాత్మక మార్పుల్ని తీసుకు రాబోతోన్నారు.
ఈ సందర్శన తర్వాత కమల్ హాసన్ సోషల్ మీడియాలో.. సినిమా నుండి సిలికాన్ వరకు ప్రతీ ఒక్కటీ నిత్యం అభివృద్ది చెందుతూనే ఉంటాయి. ఎంత కనిపెట్టినా, ఏం చేసినా కూడా ఇంకా ఏదో చేయాలని, కనిపెట్టాలనే ఆ కూతుహలం, ఆ దాహం ఇంకా మనలో ఉంటూనే ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని పెర్ప్లెక్సిటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంతో నాలో ఇంకా కొత్త ఆలోచనలకు ప్రేరణ లభించినట్టు అనిపిస్తుంది. అరవింద్ శ్రీనివాస్, అతని బృందం కలిసి భవిష్యత్తును నిర్మించడంలో మన భారతీయ చాతుర్యం ప్రకాశిస్తుంది అని అన్నారు.
ఈ భేటీపై అరవింద్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పర్ప్లెక్సిటీ కార్యాలయంలో కమల్ హాసన్ గారిని కలవడం, ఆయనకు ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. చిత్రనిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను నేర్చుకోవాలనే మీ ఆలోచనలు, సినిమా పట్ల మీకున్న ప్యాషన్ స్ఫూర్తిదాయకం. థగ్ లైఫ్‌తో పాటుగా మీరు పనిచేస్తున్న భవిష్యత్ ప్రాజెక్టులకు శుభాకాంక్షలు అని అన్నారు.
అరవింద్ శ్రీనివాస్ ఒక భారతీయ-అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు వ్యవస్థాపకుడు. అతను ఐఐటీ మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్,మాస్టర్స్ డిగ్రీలు, యూసీ బర్కిలీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పొందారు. శ్రీనివాస్ 2022లో పెర్ప్లెక్సిటీ ఏఐని సహ-స్థాపించే ముందు ఓపెన్ఏఐ, డీప్‌మైండ్, గూగుల్ వంటి ప్రముఖ AI సంస్థల్లో పనిచేశారు. పర్‌ప్లెక్సిటీ అనేది జ్ఞాన-కేంద్రీకృత వేదికను సృష్టించడంలో దృష్టి సారించిన ఏఐ స్టార్టప్. ఈ కంపెనీకి జెఫ్ బెజోస్, యాన్ లెకున్ వంటి ప్రముఖ వ్యక్తులు మద్దతు ఇస్తున్నారు.
కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ విడుదలకు సిద్ధం అవుతోంది. కమల్ హాసన్ హోం బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మణిరత్నం మద్రాస్ టాకీస్, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ నిర్మించిన ఈ థగ్ లైఫ్‌లో అద్భుతమైన నటీనటులు ఉన్నారు. కమల్ హాసన్ ఈ చిత్రంలో రంగరాయ శక్తివేల్ నాయకర్‌గా నటించగా, సిలంబరసన్ టిఆర్, త్రిష కృష్ణన్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి కీలక పాత్రలు పోషించారు. మణిరత్నం దర్శకత్వంలో, ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న థగ్ లైఫ్ జూన్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.