సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (17:05 IST)

సినిమాలలో కొనసాగలేను...ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన స్టార్ హీరో

సుమారు 22 ఏళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు' సినిమా తెలుగు, తమిళ భాషలలో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో కమల్ హాసన్ డ్యూయెల్ రోల్ చేయడం హైలైట్‌గా నిలిచింది. ఇటీవలే ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న 'భారతీయుడు 2' సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ నెల చివర్లో జరగనున్న ఎన్నికల్లో ప్రచారం చేయడం కోసం కమల్ హాసన్ షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్నారు. 
 
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో సినిమాలు చేయడంపై అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. గత కొద్ది రోజులుగా కమల్ హాసన్ నటించబోయే చివరి చిత్రం ఇదేనంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. నేను ప్రజా సేవ చేయాలని అభిమానులు కోరుకుంటే సినిమాలు చేయడం ఆపేస్తాను. తన సినిమాలపై అభిమానం ఉన్నవారికి ఇది నిరాశ కలిగించవచ్చు. 
 
ఇందుకు అభిమానులంతా నన్ను క్షమించాలి. ఎందుకంటే ఒకే సమయంలో అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో కొనసాగలేను. ఇప్పటికే రాజకీయాల్లోకి రావడం ఆలస్యమైంది కాబట్టి అన్నీ తొందరగా జరగాలి. నేను చేయాల్సింది చాలా ఉందంటూ కమల్ వ్యాఖ్యానించారు. 'భారతీయుడు-2' చిత్రంలో రాజకీయ అంశాలున్నాయా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. నేను సినిమాలో నటిస్తున్నాను అంతే. ఈ ప్రశ్నపై స్పందించాల్సింది నేను కాదు.. దర్శకుడు. కాబట్టి ఈ ప్రశ్న శంకర్‌ని అడగండంటూ తెలిపారు.