మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (11:18 IST)

'ఇండియన్-2' సెట్స్‌లో క్రేన్ ప్రమాదంపై స్పందించిన కమల్ హాసన్

ఎస్.శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కుతోంది. విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో భారీ సెట్ వేశారు. అయితే, ఈ సెట్‌లో 150 అడుగుల ఎత్తునున్న క్రేన్‌ ఒక్కసారిగా తెగిపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సహాయకులు మృతి చెందగా, మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో డైరెక్టర్‌ శంకర్‌ సహాయకులు ఉన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 
 
అయితే, ఈ ప్రమాదంపై హీరో కమల్ హాసన్ స్పందించారు. సెట్స్‌లో జరిగిన ప్రమాదం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ప్రమాదంలో ముగ్గురు ప్రతిభావంతులను కోల్పోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన బాధ కంటే వారి కుటుంబీకుల బాధ ఎన్నో రెట్లు ఎక్కువని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు కమల్‌ తెలిపారు. వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన తెలియజేశారు.