సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (15:30 IST)

మహాత్మా గాంధీ లాంటివాడినని కటింగులిచ్చాడు : విజయసాయి రెడ్డి

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. బాబు నెట్‌వర్క్‌ను చూసిన ముంబై కార్పొరేట్ రంగం బిత్తరపోయిందంటూ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు పీఎస్‌ ఇళ్లను ఐటీ అధికారులు సోదాలు చేస్తేనే వేల కోట్ల అక్రమ సంపాదన బయటపడిందని.. ఇంకా ఆయన బినామీలు, కాంట్రాక్టు సంస్థలపై దాడులు చేస్తే రూ.లక్షల కోట్లు దొరుకుతాయన్నారు. 
 
'మహాత్మా గాంధీ లాంటివాడినని కటింగులిచ్చాడు. నిప్పు కణికలు నన్ను చూసి ఈర్షపడతాయని గొప్పలు పోయాడు. అక్రమ సంపాదనను వ్యవస్థీకృతం చేసి 14 ఏళ్ల పాటు విచ్చలవిడిగా దోచుకున్నాడు. వ్యవస్థలన్నింటిని మ్యానేజ్ చేసి తప్పించుకుంటూ వచ్చాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గ్రహించలేక పోయాడు. 
 
పీఎస్ ఇళ్లను సోదాలు చేస్తేనే వేల కోట్ల బ్లాక్ మనీ బయటపడింది. బినామీలు, పెంచి పోషించిన కాంట్రాక్టు సంస్థలను జల్లెడ పడితే పది లక్షల కోట్లయినా దొరుకుతాయి. బాబు నెట్ వర్క్ ను చూసి ముంబాయి కార్పోరేట్ సంస్థలన్నీ బిత్తర పోయాయట. ఇప్పడు బయటకొచ్చింది ఉల్లిపాయపై పొర మాత్రమేనని' విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. 
 
అలాగే, ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా స్పందించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రతి పనిలో అవినీతి జరిగిందని విమర్శించారు. బాబు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. 
 
అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలో ప్రతి పనిలో చిన్నబాబుకు కమిషన్లు వెళ్ళేవని విమర్శించారు. చంద్రబాబు అవినీతిని ఐటీ అధికారులు నిగ్గు తేల్చారని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమే అని చెప్పడంతో అవినీతి చేసిన టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు.
 
టీడీపీ ప్రజాధనాన్ని దోచుకునే ఓ సంస్థ అని వైకాపా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అని విమర్శించారు. రాజధాని భూముల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారనీ, అచ్చెన్నాయుడు, బొండా ఉమాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. 
 
ఫోర్త్‌ ఎస్టేట్‌గా నిలువాల్సిన మీడియా విలువలను ఎల్లో మీడియా నాశనం చేసిందన్నారు. ఇంట్లో ఉన్న విద్యావంతులైన పిల్లల ద్వారా ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. తెలుగుదేశం డ్రామా కంపెనీ మూసివేసే టైమ్‌ వచ్చిందని అభిప్రాయపడ్డారు.