సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (18:02 IST)

రాజేష్ చెప్పిన కథకి "ఆచార్య" స్టోరీకి సంబంధం లేదు: కొరటాల శివ

మెగాస్టార్ చిరంజీవి - క్రియేటివ్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ "ఆచార్య". ఈ చిత్రాన్ని చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో మాటినీ ఎంటర్టయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూర్చుతుంటే.. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనుంది. రామ్ చరణ్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారు. 
 
అయితే, ఈ నెల 22వ తేదీ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం మోషన్ పోస్టర్, టైటిల్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే, ఈ మోషన్ పోస్టర్ చూసిన తర్వాత ఆచార్య చిత్ర కథ తన కథను పోలినట్టుగా ఉందని పేర్కొంటూ కన్నెగంటి అనిల్ కృష్ణ, రాజేశ్ మండూరి అనే ఇద్దరు రచయితలు వేర్వేరుగా ఆరోపణలు చేశారు. దీనిపై 'ఆచార్య' చిత్ర యూనిట్ ప్రకటన జారీ చేసింది.
 
'ఆచార్య' సినిమాను కొరటాల శివ తయారుచేసిన ఒరిజినల్ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నామని ఆ ప్రకటనలో వెల్లడించింది. 'ఆచార్య' సినిమా కథ కాపీ కొట్టారంటూ వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. "ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్2ను కూడా ఇటీవలే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశాం. దీనికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. 'ఆచార్య' సినిమాపై హైప్ ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఇద్దరు రచయితలు ఈ సినిమా స్టోరీకి సంబంధించి అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి మేం 'ఆచార్య' సినిమా కథను ఎంతో గోప్యంగా ఉంచాం. యూనిట్లో కూడా ఈ చిత్ర కథ తెలిసినవాళ్లు అతి కొద్దిమంది మాత్రమే.
 
ఈ నేపథ్యంలో మేం విడుదల చేసిన మోషన్ పోస్టర్‌ను చూసి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు మేం స్పష్టం చేయదలచుకుంది ఏమిటంటే... ఇది ఒక ఒరిజనల్ కథ. కొరటాల శివ వంటి ప్రముఖ ఫిలింమేకర్‌ను అప్రదిష్ఠ పాల్జేయడం ఆమోదయోగ్యం కాదు. ఈ ఆరోపణలన్నీ కూడా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఆచార్య చిత్ర కథపై వస్తున్న ఊహాగానాలను ఆధారంగా చేస్తున్నవేనని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాకు సంబంధించి వచ్చే ఏ ఆరోపణ అయినా పూర్తిగా నిరాధారం, అవన్నీ కూడా కల్పిత కథల ఆధారంగా పుట్టుకొచ్చినవే అయ్యుంటాయి" అంటూ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.