విజయం కోసం క్రియేటివ్ డైరెక్టర్ అలా చేస్తున్నాడా..?
క్రియేటివ్ డైరెక్టర్ అనగానే ఠక్కున గుర్తుకువచ్చే పేరు కృష్ణవంశీ. ఆయన కెరీర్ ప్రారంభంలో ఎన్నో వైవిధ్యమైన, విజయవంతమైన చిత్రాలు అందించారు. ఆతర్వాత క్రియేటివిటీ తగ్గిందో ఏమో సక్సస్ రాలేదు. చందమామ తర్వాత ఆయనకి సక్సస్ రాలేదు. కానీ ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్నప్పటికీ సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు తన కథతో సినిమా తీస్తే విజయం సాధించడం కష్టం అనుకున్నాడేమో.
రీమేక్ చేయాలనుకుంటున్నారట. ఇంతకీ ఏ సినిమాని అంటే... 2016వ సంవత్సరంలో వచ్చిన మరాఠి చిత్రం నట సామ్రాట్. ఈ చిత్రంను క్రియేటివ్ డైరెక్టర్ రీమేక్ చేయబోతున్నాడట. నట సామ్రాట్ చిత్రానికి మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించగా నానా పటేకర్ లీడ్ రోల్‌ను పోషించాడు. ఒక ప్రముఖ నటుడు జీవితంలో ఎదుర్కొన్న ఒడుదొడుకుల గురించి ఆ చిత్రంలో చూపించడం జరిగింది. మరాఠిలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఆ చిత్రంను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కృష్ణవంశీ సన్నిహితుడైన ప్రకాష్ రాజ్ ఈ రీమేక్‌లో నానాపటేకర్ పాత్రను పోషించబోతున్నాడని సమాచారం. దిల్ రాజు బ్యానర్లో ఈ చిత్రం నిర్మాణం జరుగబోతుంది. ఈ సినిమాతో అయినా కృష్ణవంశీకి సక్సస్ సాధించాలని కోరుకుందాం.