ఇద్దరం క్రాస్ ప్రమోషన్స్ చేసుకుందాం అన్నారుః విశ్వక్ సేన్
'ఫలక్‌నూమాదాస్'తో ఆకట్టుకున్న టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రెండో చిత్రం `హిట్`తో మంచి కమర్షియల్ హిట్‌ను సాధించారు. ప్రస్తుతం ఆయన హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `పాగల్`. మ్యాజికల్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 30న గ్రాండ్‌గా విడుదలకానుంది. మార్చి 29 పుట్టినరోజు సందర్భంగా విశ్వక్ సేన్ చెప్పిన విశేషాలు.
- స్పెషల్‌గా ప్లాన్స్ అంటూ ఏంలేవు..రేపు కూడా షూటింగ్‌కి వెళ్తున్నాను. గతేడాది పాగల్ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి అవగానే లాక్‌డౌన్ వచ్చింది. ఆ సినిమాకి రానా క్లాప్ కొట్టారు. అయితే యాదృచ్చికంగా మా ఇద్దరి సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి. ఇదే విషయాన్ని రానాకి చెప్తే మనం ఇద్దరం క్రాస్ ప్రమోషన్స్ చేసుకుందాం అని నవ్వుతూ అన్నారు. రేపటితో పాగల్ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఏప్రిల్ ఫస్ట్ నుండి ఈ సినిమాకి సంబందించి నాన్‌స్టాప్ అప్‌డేట్స్ ఉంటాయి.
- థియేట్రికల్ ట్రైలర్‌ని కేవలం థియేటర్స్‌లోనే ప్లే చేయబోతున్నాం. దిల్‌రాజుగారు కూడా ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంతకు ముందు థియేట్రికల్ ట్రైలర్ కేవలం థియేటర్స్‌లోనే ప్లే అయ్యేది. ఈ మధ్య కాలంలో సోషల్‌మీడియా, స్మార్ట్‌ఫోన్‌లలోనే ఎక్కువ ప్లే అవుతుంది. అలా జరగకూడదు అనే మా టీమ్ అందరం కలిసి ఈ కొత్త నిర్ణయం తీసుకున్నాం. మరో 15రోజుల్లో పాగల్ ప్రమోషన్స్‌లో భాగంగా రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో పాగల్ రథయాత్ర చేయబోతున్నాం. వీలైనన్ని ఎక్కువ జిల్లాల్లో పర్యటించనున్నాం.
- ఇప్పటివరకూ నేను ఒకదానితో ఒకటి సంభందం లేకుండా విభిన్న కథాంశాలతో సినిమాలు చేశాను. ఇప్పుడు పాగల్ సినిమా కూడా ఒక కొత్త ప్రయత్నం. ప్రేమించేటప్పుడు కొంతమంది పిచ్చోడిలా ఆలోచిస్తుంటారు ఈ సినిమాలో నా క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది, అందుకే ఈ టైటిల్ పెట్టడం జరిగింది. మా టీమ్ అందరం కలిసి తీసుకున్న నిర్ణయం అది.
- రీసెంట్‌గా విడుదలచేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కథ వినగానే చాలా ఎగ్జయిట్ అయ్యాను. అందుకే ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. టీజర్‌లో మీకు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే చూపించాం. రేపు సినిమాలో దానితో పాటు బలమైన ఎమోషన్స్ కూడా ఉంటాయి. కమర్షియల్ సినిమాల్లో కొత్త ఫార్ములా ఇది.
- సినిమా పరిశ్రమలో లాక్‌డౌన్ తర్వాత చాలా మార్పు వచ్చింది. ఒక న్యూ బిగినింగ్‌లా ఉంది. గత చిత్రాలతో సంభందం లేకుండా ఎవరైనా మళ్లీ కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సి వస్తోంది. అందుకే మరో సాలిడ్ సినిమాతో మీముందుకు రాబోతున్నాను.
- రధన్ మంచి సంగీతం ఇచ్చారు. మూడు పాటలు ఉన్నాయి. అన్ని సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఒక డైరెక్టర్‌ని పూర్తిగా నమ్మిన తర్వాతే సినిమా చేస్తాను. ఆ ప్రాసెస్‌లో ఎలాంటి సజెషన్స్ ఇవ్వను. దర్శకుడు నరేష్ ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా తెరకెక్కించాడు.
- దర్శకుడు తరుణ్ భాస్కర్ మా ఫ్యామిలీఫ్రెండ్.. తనతో అన్ని విషయాలు డిస్కస్ చేస్తాను. అతనితో సినిమా గురించి తరుణ్ చెప్తేనే బాగుంటుంది.
- `ప్రాజెక్ట్ గామీ` షూటింగ్ పూర్తయ్యింది. క్లాసిక్ అడ్వెంచర్ డ్రామా అది. డిఫరెంట్ లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. ఆ సినిమాలో సీజీ వర్క్ ఎక్కువ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కి మరో ఆరు నెలల సమయం పడుతుంది. అలాగే పివిపి బ్యానర్‌లో ఒక సినిమా చేస్తున్నా..అది ఏప్రిల్ 3నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బీవిఎస్ఎన్ ప్రసాద్‌గారితో ఒక సినిమా ఉంది. ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.