గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (14:40 IST)

'లైగర్‌'కు బీరాభిషేకం - రచ్చ చేసిన రౌడీ ఫ్యాన్స్

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ తాజా చిత్రం లైగర్. పులి - సింహం క్రాస్ బ్రీడ్ లైగర్ అంటూ ఆ చిత్రానికి దర్శకత్వం వహించనున్న స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా టైటిల్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. అంతే.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ చేయడం మొదలుపెట్టారు. 
 
సాధారణంగా సినిమా విడుదల రోజున ఫ్యాన్స్ హంగామా ఉంటుంది. కానీ, టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ రోజునే రచ్చ రచ్చ చేశారు. అయితే, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం ఆనవాయితీకి భిన్నంగా పాలాభిషేకం చేయకుండా, ఏకంగా బీరాభిషేకం చేస్తున్నారు. సినిమా టైటిల్‌ని టాటూగా వేయించుకొని తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 
 
పూరీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి వినూత్నంగా 'లైగర్' అని పేరు పెట్టారు. 'సాలా క్రాస్‌బ్రీడ్స్‌'‌ అనే ఉప శీర్షిక కూడా పెట్టారు. టైటిల్‌ డిఫరెంట్‌గా ఉండడం, విజయ్‌, పూరీ కాంబోలో తొలి చిత్రం కావడంతో అటు పూరీ ఫ్యాన్స్‌, ఇటు రౌడీ ఫ్యాన్స్‌ అప్పుడే హడావుడి మొదలుపెట్టారు. 
 
భారీ కటౌట్స్, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేశారు. కేక్స్ కట్స్ చేశారు. లైగర్ పోస్టర్‌కు ఇద్దరు అభిమానులు బీర్‌తో అభిషేకం చేశారు. అలాగే విజయ్ వీరాభిమానులు తమ చేతులమీద ‘లైగర్’ పేరుని టాటూగా వేయించుకున్నారు. ఈ వీడియో షేర్ చేస్తూ కళ్లవెంట నీళ్లు వచ్చాయంటూ చార్మీ చెప్పారు.