శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 4 డిశెంబరు 2019 (20:55 IST)

సందడి సందడిగా ‘మా’ వనభోజనాలు

అందాల హైటెక్ సిటీ నడుమ సుందర నందన వనం. అక్కడ చేరిన వారంతా సినిమా నటులే... వారిలో ఓ పక్క సంతాపం... మరో పక్క సంతోషం... ఓ కంట కన్నీరు, మరో కంట పన్నీరు... వెరసి చక్కటి ఆహ్లాదకర వాతావరణం. సినీ నటుల వన భోజన కార్యక్రమం. హైటెక్ సిటీలోని ఫీనిక్స్ ఎరీనాలోని టీఎస్ఐఐసి పార్క్ లో ఈ వనభోజనాల కార్యక్రమం సందడి సందడిగా సాగింది. ‘మా’ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ నేతృత్వంలో విజయవంతంగా ఈ కార్యక్రమం కొనసాగింది.
 
మా వైస్ ప్రెసిడెంట్లు బెనర్జీ, హేమ, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అలీ, తనీష్ జయలక్ష్మి, అనితా చౌదరి, రాజా రవీంద్ర, రవిప్రకాష్, ఉత్తేజ్, ఏడిద శ్రీరామ్, సురేష్ కొండేటి, యువహీరో కార్తికేయ, సీనియర్ నటులు గిరిబాబు, ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర చౌద‌రి, ‘మా  ’ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా, సంపూర్ణేష్ బాబు, రాశి, డిస్కోశాంతి, శివారెడ్డి, గాయని మంగ్లీ, హీరోయిన్ ముస్కాన్ తదితరులు ఎందరో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 
ఇంత సందడిలోనూ చోటుచేసుకున్న విషాదానికి కారణం దిశా హత్యాచారం ఘటన. ఆమెపై జరిగిన అత్యాచారం, సజీవ దహనం ఘటన తమ మనసుల్ని కలచివేసిందని అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఆమె చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు. మానవ సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్ణకరమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి గుండెకోత ఏ తల్లిదండ్రులకూ రాకూడదని రాజశేఖర్, జీవిత దంపతులు అన్నారు.