మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 9 మే 2019 (21:15 IST)

సందేశాత్మకంగా "మహర్షి" (మూవీ రివ్యూ) (video)

చిత్రం : 'మహర్షి' 
నటీనటులు : మహేష్‌ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్‌, జగపతిబాబు, ప్రకాష్‌ రాజ్‌, జయసుధ, వెన్నెల కిషోర్‌ తదితరులు.,
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌,
రచన : వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్‌, 
నిర్మాతలు : దిల్‌ రాజు - అశ్వినీదత్‌ -  ప్రసాద్‌ వి.పొట్లూరి - పరమ్‌ వి.పొట్లూరి,
స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం : వంశీ పైడిపల్లి.
 
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 25వ చిత్రం "మహర్షి". మే 9వ తేదీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్‌లోనూ, టీజర్‌లోనూ రిచ్‌లుక్‌తో ప్రేక్షకుల్ని ఆసక్తికరంగా నిలువడంతో ఈ చిత్రం భారీ క్రేజ్ ఏర్పడింది. దర్శకుడు రెండేళ్ళ తన కోసం ఎదురుచూశాడనీ, సామాజిక అంశంతో చిత్రాన్ని తీశామని హీరో మహేష్ బాబు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మరి ఈ చిత్ర కథ ఎలా ఉందో ఓసారి పరిశీలిద్ధాం. 
 
కథ: 
రిషి కుమార్‌ (మహేష్‌ బాబు) హైదరాబాద్‌లో మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. తనకున్న బలంతోనే సక్సెస్‌లో నెంబర్‌గా వుండాలనేది అతని లక్ష్యం. అది చిన్నతనంలో తండ్రి చేసిన రూ.10 వేల అప్పు తీర్చలేకపడిన ఆవేదన నుంచి బీజం పుట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రిలా బతక్కూడదనీ ప్రపంచాన్ని శాసించేస్థాయికి ఎదగాలనే కోరికబలంగా నాటుకుపోతుంది. ఎంటెక్‌ కోసం వైజాగ్‌ వెళ్తాడు. అక్కడ అతడికి పూజ (పూజా హెగ్డే), రవి (అల్లరి నరేష్‌)లు పరిచయమవుతారు. 
 
ఆ తర్వాత వారిద్దరూ మంచి స్నేహితులుగా మారుతారు. వీరితో బంధం బలపడుతుంది. తర్వాత పరిస్థితులవల్ల ఇద్దరికీ దూరమవుతాడు. అలా దూరమై అమెరికాలో ప్రపంచంలోనే అతి పెద్దదైన కంపెనీకి సీఈవో అవుతాడు. సక్సెస్‌తో ఈస్థాయికి వచ్చానని అనుకుంటున్న అతనికి ఓ చేదునిజం తెలుస్తుంది. దాంతో హుటాహుటిన భారత్‌కు వస్తాడు. ఆ చేదు నిజం ఏమిటి? రవి ఏమయ్యాడు? పూజను ఎందుకు దూరంగా చేసుకున్నాడు. స్వదేశం వచ్చాక రిషి ఏం చేశాడు? అన్నదే మిగిలిన చిత్ర కథ. 
 
విశ్లేషణ: 
మామూలు కుటుంబంలో పుట్టిన హీరో ప్రపంచంలోనే అతి పెద్ద కార్పొరేట్‌ కంపెనీకి సీఈవోగా ఎలా ఎదిగాడనేది అసలు పాయింట్‌. తెలుగు ప్రాంతానికి చెందిన మేధావులు అమెరికాను శాసించేస్థాయికి చేరుకున్న వ్యక్తులు వున్నారు. ఇక సినిమాపరంగా చూస్తే ఓ స్నేహితుడి కోసం హీరో అమెరికా నుంచి ఇండియా తిరిగి రావడమనేది కీలకమైన పాయింట్‌. వచ్చాక ఇక్కడ జరిగే రాజకీయాలు, కార్పొరేట్‌ అధినేతలు రైతుల్ని, ప్రజల్ని ఏ విధంగా పీడిస్తున్నారనే కోణంలోనే కథ సాగుతుంది. మొదటి భాగం కాలేజీ జీవితం, సీఈవోగా ఎదిగిన విధానం ఆసక్తికరంగా ఎంటర్‌టైన్‌మెంట్‌లో సాగుతుంది. 
 
రెండోభాగంలో కథంతా చెప్పాలి కాబట్టి సీరియస్‌గా సాగుతుంది. ముఖ్యంగా స్నేహితులుగా ఈ మూడు పాత్రలు ఎస్టాబ్లిష్‌ చేయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. ఆ తర్వాత యూత్‌కూ, పెద్దలకు మంచి సందేశమూ వుంది. అందులో సెంటిమెంట్ కావల్సినంత పండింది. తన తండ్రి ఓటమిని కూడా ఆనందంగా స్వీకరించడం వెనుక ఎంత కథ దాగివుందో దాన్ని తెలుసుకున్నాక కంటతడిపెట్టిస్తుంది. స్నేహితుడు తన ఎదుగుదలకు అతని కెరీర్‌ను ఎలా నాశనం చేసుకున్నాడనే ఆలోచనలో ఆర్ద్రతవుంది. 
 
సాఫ్ట్‌వేర్‌ అంటూ లక్షల జీతాలు తీసుకుంటూ వీకెండ్‌లతో ఎంజాయ్‌ చేసే యువత అవసరమైతే రైతుగా మారండని చెప్పడంలో నీతి వుంది. ఇలా అన్ని అంశాలు టచ్‌ చేస్తూ సాగిన ఈ కథలో దర్శకుడి పోరాటం ఎవరిమీదనే దానిలో క్లారిటీ కాస్త లోపించింది. కార్పొరేట్‌ సంస్థల మెప్పుకోసం రైతుల్ని, ప్రజల్ని పీడించే ప్రభుత్వంపైనా, కార్పొరేట్‌పైన తిరుగుబాబు అనేది వివరింగా చెబితే సినిమా మరింత హైప్‌ వచ్చేది. 
 
అయితే ఇలాంటి కథలతో పలు చిత్రాలూ వచ్చాయి. నేపథ్యాలే వేరు. ఇదే విషయాన్ని దేవీశ్రీప్రసాద్‌ పాటతో 'ఇలాంటి కథలో ఎన్నో వచ్చాయి. ఇది మరో కొత్తకథ' అంటూ ఓ చరణంలో క్లారిటీ ఇచ్చాడు. దాంతో మహేష్‌ చేసిన సందేశాత్మక చిత్రాలు కొన్నిస్ఫురిస్తాయి. ఇక కాలేజ్‌ ఎపిసోడ్‌లో కొద్ది పార్ట్‌ '3 ఇడియట్స్‌' స్ఫూర్తి కనిపిస్తే.. హీరో పల్లెటూరికి వచ్చి అక్కడి వాళ్ల కోసం పోరాడే వైనం 'శ్రీమంతుడు', 'ఖలేజా', రైతు సమస్యలపై మాట్లాడినప్పుడు 'ఖైదీ నంబర్‌ 150' ఛాయలు కనిపిస్తాయి. కాకపోతే ప్రతి ఎపిసోడ్‌లోనూ ఏదో ఒక ఆకర్షణ అయితే ఉండేలా చూసుకున్నాడు. సినిమా మొత్తంలో ఎక్కడా కూడా ఫ్రస్టేట్‌ చేసే సన్నివేశాలైతే లేవు. కొత్తగా అనిపించకపోయినా ఎంగేజింగ్‌గా అనిపించే సన్నివేశాలు సినిమాను అలా అలా నడిపించేస్తాయి.
 
మొదటి చెపుతున్నట్లు కాలేజీ ఎపిసోడ్‌ చిత్రానికి కీలకం. ఆ పాత్రలో విద్యార్థిగా మహేష్‌ బాగా సూటయ్యాయడు. అలాగే సీఈవోగా మరింత ఆకట్టుకున్నాడు.  రైతుగా ఆకట్టుకున్నా... వస్త్రధారణలో కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఏదిఏమైనా ఉన్నంతలో ప్రతి సన్నివేశాన్ని సరదాగా నడిపించేశాడు వంశీ.  ఓ కార్పొరేట్‌ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్న తన స్నేహితుడుకు హీరో అండగా నిలిచి అతడి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే ఎపిసోడ్‌ నాటకీయంగా కొంచెం కృత్రిమంగా కూడా అనిపిస్తుంది. అమెరికాకు చెందిన సీఈఓ ఏకంగా ఇండియాలో ఓ గ్రామంలో స్నేహితుడి కోసం తన కార్యాలయాన్ని స్థాపించడం. ఇదొక్కటి మినహా మొత్తంగా లాజికల్‌గానే వుంటుంది.
 
ఏదిఏమైనా మనిషిలో బలం ఉంటుంది. దాన్ని గుర్తించాలి. అలా స్నేహితుడి ద్వారానే సాధ్యమవుతుంది. అప్పుడు కెరీర్‌లో ఎదగలరు ఎవరైనా.. బ్యాక్‌లాగ్‌ ఉందని ఆత్మహత్యచేసుకొనే వ్యక్తిలో రగిలిన ఆ స్ఫూర్తి.. నేటి యువతను ఆలోచింపజేస్తుంది. చిత్రం రెండో భాగంలో కథ ఎక్కువ భాగంగా చెప్పినట్లుగా అనిపిస్తుంది. సినిమా ముగింపు దశకు వచ్చింది ఇక మనం ఏదో ఒకటి చేయాలన్నట్లుగా పాత్రను డిజైన్‌ చేశాడు దర్శకుడు. అక్కడి నుంచి కథనం కాస్త పరుగులు పెడుతుంది. 
 
రైతు సమస్యల మీద హీరో ప్రెస్‌‌మీట్‌ సీన్‌ ఆకట్టుకుంటుంది. ఉద్వేగాలు రేకెత్తిస్తుంది. విలన్‌ పాత్రను తేల్చిపడేయడంతో ముగింపు ఆశించిన స్థాయిలో లేదు. 'ఇదే కదా ఇదే కదా నీ కథ' పాట పడకపోయి ఉంటే.. క్లైమాక్స్‌ తేలిపోయేదే. హీరోయిన్‌ పూజా హెగ్డే పాత్ర కథలో భాగమే విలన్‌ పాత్రలో జగపతిబాబు జీవించాడు. ప్రకాష్‌ రాజ్‌ ఉన్నంతలో బాగానే చేసినా.. పాత్ర పరిధిని బాగా తగ్గించేశారు. రావు రమేష్‌, సాయికుమార్‌, రాజీవ్‌ కనకాల తమ పరిధిలో బాగానే చేశారు. వెన్నెల కిషోర్‌ పాత్ర ఆశించిన స్థాయిలో లేదు.
 
మోహనన్‌ ఛాయాగ్రహణం ఉన్నత స్థాయిలో కనిపిస్తుంది. విజువల్స్‌ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ప్రతి సన్నివేశంలోనూ రిచ్‌‌నెస్‌ కనిపిస్తుంది. ముగ్గురు నిర్మాతలు కలిసి తీసిన ఈ సినిమాకు ముగ్గురు రచయితలు కలిసి పనిచేయడం విశేషం. వారు రాసిన డైలాగ్స్‌లు ఆలోచింపజేసేవిగా ఉన్నా అవి విన్నట్లే వుంటాయి. మొత్తంగా హీరో స్థాయికి తగినట్లు ఆలోచింపజేసే చిత్రంగా ఉందనడంలో సందేహంలేదు.
 
రేటింగ్‌: 3/5