గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2023 (18:13 IST)

సడన్ గా బరువు పెరగడం మంచిది కాదని మహేష్ బాబు చెప్పారు : సుధీర్ బాబు

Sudhir Babu,
Sudhir Babu,
హీరో సుధీర్ బాబు మూడు పాత్రల్లో నటించిన చిత్రం మామా మశ్చీంద్ర. దుర్గా పాత్రలో చాలా ఫ్రెష్ నెస్ వుంటుంది. పరశురాం పాత్ర కథలో చాలా కీలకం. ఆ పాత్రతో సినిమా అంతా కనెక్ట్ అవుతారు. అలాగే డిజే పాత్రలో వేరియేషన్ చూపించడం కూడా ఒక సవాల్ గా అనిపించింది. ఇందులో కామెడీ కూడా చాలా కొత్తగా ప్రయత్నించాం. సిట్యువేషనల్ కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. అని సుధీర్ బాబు తెలిపారు. 
 
హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ మామా మశ్చీంద్ర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ తో పాజిటివ్ బజ్‌ ని క్రియేట్ చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. అక్టోబర్ 6న సినిమా విడుదలౌతున్న నేపధ్యంలో  హీరో సుధీర్ బాబు విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
‘మామా మశ్చీంద్ర’ చేయడానికి ప్రధాన కారణం ?
నా కెరీర్ లో ఇప్పటివరకూ నా దగ్గరకి వచ్చిన కథల్లో నాకు నచ్చినవి ఎంపిక చేసుకొని చేసినవే.  ఫలానా కథ చేయాలని, అలాంటి కథని తయారు చేయించే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. అయితే తొలిసారిగా హర్ష పై వున్న నమ్మకంతో తనతో వర్క్ చేయాలని కథ చేసుకొని రమ్మని చెప్పాను. తను చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. చాలా డిఫరెంట్ స్క్రిప్ట్. మనం, గుండెజారే గల్లంతైయ్యిందే చిత్రాలతో తను మంచి రైటర్ గా నిరూపించుకున్నారు. తనకి సినిమాలపై మంచి పట్టువుంది. ‘మనం’ చూసినప్పుడు ఎంత కొత్తగా అనిపించిందో.. మామా మశ్చీంద్ర చూసినప్పుడు కూడా అలాంటి కొత్త అనుభూతిని ఇస్తుంది.  
 
ట్రిపుల్ రోల్ చేయడం ఎలా అనిపించింది ?
ఇందులో నన్ను ఎక్సయిట్ చేసింది ఇదే. కృష్ణమ్మ కలిపింది, భాగీ, భలే మంచి రోజు లాంటి చిత్రాలలో డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ వచ్చాను. నేను ఇలాంటి పాత్రలు కూడా చేయగలను అని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు. మామ మశ్చీంద్ర లో ట్రిపుల్ రోల్ ని ఒక అవకాశంగా భావించాను. ఇందులో మూడు పాత్రలకు మూడు డిఫరెంట్ యాసలు వుంటాయి. ఒక పాత్ర తెలంగాణ, మరొకటి ఉత్తరాంద్ర, ఇంకొ పాత్రకు రాయలసీమ యాస వుంటుంది. ఈ మూడు యాసలు నావి కాదు. ఓల్డ్ పాత్రకు ఇంకో డబ్బింగ్ వుంటుంది. అది నా రెగ్యులర్ భాష. ప్రతి పాత్రకు వేరియేషన్ వుంది. ఒక పాత్ర కోసం బరువు పెరిగాను. మరో పాత్రకు ప్రోస్తటిక్స్ వాడాం. యంగ్ గా కనిపించే పాత్ర కోసం డైట్ రొటీన్ పాటించాను. ఈ చిత్రం మెంటల్ గా ఫిజికల్ గా ఒక ఛాలెంజ్. నేను కొత్తగా ప్రయత్నిస్తాననే నమ్మకం ప్రేక్షకుల్లో వుంది.  మామా   మశ్చీంద్ర కూడా తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుంది. కంటెంట్ వున్న కమర్షియల్ సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కలసి హాయిగా చూడొచ్చు. చాలా మలుపులు, ట్విస్ట్ లు వుంటాయి.
 
తొలిసారి ప్రోస్తటిక్ వాడటం ఎలా అనిపించింది ?
ఇది డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. నిజానికి ఒక పాత్ర కోసం బరువు ని రియల్ గా పెంచాలని అనుకున్నాను. అయితే సడన్ గా అంత బరువు పెరగడం మంచిది కాదని మహేష్ బాబు గారితో పాటు సన్నిహితులందరూ చెప్పారు. దీంతో ప్రోస్తటిక్ ని వాడటం జరిగింది. యంగ్ పర్సన్ కి వాడే ప్రోస్తటిక్ మెటిరియల్ చాలా స్టిఫ్ గా వుంటుంది. దీంతో ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ ని చూపించడంలో కొంత ఛాలెంజ్ వుంటుంది. ఇందులో మాత్రం చాలా మంచి వర్క్ చేశాం. ఆడియన్స్ కి ఎక్కడా కూడా ప్రోస్తటిక్ ఫీలింగ్ రాదు. చాలా సహజంగా కుదిరింది. ఈ విషయంలో చిన్న టెస్ట్ కూడా పెట్టుకున్నాను.  మా అపార్ట్మెంట్ కి ఫోన్ చేసి ‘ఫలానా వాడు వస్తున్నాడు లోపలకి రానివ్వొద్దని’ చెప్పాను. ప్రోస్తటిక్ గెటప్ లో నేను వెళ్ళినపు నన్ను రానివ్వలేదు. దాదాపు గంటపాటు గొడవ జరిగింది( నవ్వుతూ) లైవ్ లో గుర్తుపట్టలేకపోయారు. సినిమా చూస్తున్నప్పుడు కూడా ప్రేక్షకులకు ఈ అనుభూతి వుంటుంది.
 
ఇందులో కృష్ణ గారితో ఓ సీన్ చేయించాలని అనుకున్నామని దర్శకుడు చెప్పారు.. దాని గురించి ?
అవునండీ. స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు అనుకున్నాం. అయితే అప్పటికే కృష్ణ గారు సినిమాలు చేయడం ఆపేశారు. కానీ ఆయన్ని ఎలాగైనా ఒప్పించగలననే నమ్మకం నాకు వుంది. చాలా మంచి సీన్. గ్రీన్ మ్యాట్ లో నైనా షూట్ చేయాలని అనుకున్నాం. కానీ ఆయన వెళ్ళిపోయారు. ఆయన   లేకపోతే ఆ సీన్ కి ప్రాధాన్యతే లేదు. అందుకే ఆ సీన్ తీయలేదు. ఆయన్ని చాలా మిస్ అవుతున్నాం. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఆయన ఆశీస్సులు నాపై ఎప్పుడూ వుంటాయి.
 
మామా మశ్చీంద్ర ఒక సింగల్ లైన్ లో చెప్పాలంటే ?
మామా మశ్చీంద్ర మల్టీ లేయర్ వున్న కథ. సెంట్రల్ లేయర్ పరశురాం పాత్ర. పరశురాం జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనలో జైలుకి కూడా వెళ్తాడు. బయటికి వచ్చిన తర్వాత తన జర్నీ ఎలా వుంటుంది ? తన పాత్ర మిగతా పాత్రలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది ? తన జీవితాన్ని మార్చింది ఎవరు ? ఇలా చాలా కోణాల్లో కథ ఆసక్తికరంగా సాగుతుంది.
 
 
 
హర్ష గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
హర్ష పై నాకు చాలా నమ్మకం వుంది. తను మంచి రైటర్, యాక్టర్. ఒక అనుభవం ఉన్న దర్శకుడితో పని చేస్తున్నట్లుగానే అనిపించింది.
 
హీరోయిన్స్ గురించి ?
ఈషా రెబ్బా తెలుగమ్మాయి. తెలుగు వాళ్ళతో పని చేయడంలో చాలా సౌకర్యం వుంటుంది. తను చక్కని నటి. మృణాలిని కూడా తెలుగు నేర్చుకొని చక్కగా నటించింది. ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకం వుంది.
 
నిర్మాతల గురించి ?
సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ గారు అనుభవం వున్న నిర్మాతలు. ఈ సినిమాకి పూర్తి న్యాయం చేశారు. చాలా మంచి టెక్నికల్ టీం ఇచ్చారు. డీవోపీ పీజీ విందా, ఎడిటర్ మార్తండ్ కె వెంకటేష్ గారు, మ్యూజిక్ చేతన్..  ఇలా అందరూ బెస్ట్ వర్క్ ఇచ్చారు. రిలీజ్ కూడా గ్రాండ్ గా చేస్తున్నాం.