శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2022 (13:51 IST)

'పొన్నియిన్ సెల్వన్' ప్రభంజనం - రూ.450 కోట్ల వసూళ్లు

ponniyin selvan
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చిత్రం "పొన్నియిన్ సెల్వన్". గత నెల 30వ తేదీన ప్రపచం వ్యాప్తంగా పాన్ ఇండియాగా విడుదలైంది. ఇతర భాషల్లో టాక్ ఎలా ఉన్నప్పటికీ తమిళంలో మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. కలెక్షన్ల పరంగా కనకవర్షం కురిపిస్తుంది. ఫలితంగా ఈ చిత్రం రూ.450 కోట్ల వసూళ్లను రాబట్టేందుకు చేరువైంది. 
 
ఈ వారం చివరి నాటికి ఈ హిస్టారికల్ ఫిక్షన్ సినిమా రూ.450 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. "పీఎస్1" తమిళ వెర్షన్.. భారత్‌తో పాటు అంతర్జాతీయ సర్క్యూట్‌లో సత్తా చాటుతోంది. కానీ, ఇతర భాషల్లో మాత్రం పెద్ద స్పందన కనిపించడం లేదు. అయినా కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. 
 
చిత్రం విడుదలైన రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల మార్క్‌ను అధిగమించింది. దాంతో, ఈ రెండు వారాల్లో వచ్చిన సినిమాల్లో పొన్నియన్ సెల్వన్ బాక్సాఫీస్ వద్ద స్పష్టమైన విజేతగా నిలిచింది. 
 
తొలి భాగానికి పెట్టిన పెట్టుబడులను చిత్ర నిర్మాతలు రికవరీ చేసినట్లు సమాచారం. రెండు పార్టులను దాదాపు ఒకే స్ట్రెచ్‌లో చిత్రీకరించారు. ఈ లెక్కన రెండో పార్టుకు వచ్చే వసూళ్లతో నిర్మాతలకు లాభాల పంట పడనుంది.  
 
మరోవైపు ఈ చిత్రానికి జర్మనీలోనూ అద్భుత స్పందన వస్తోందని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా తెలిపారు. జర్మనీ బాక్స్ ఆఫీస్ వద్ద పది రోజుల్లో నిర్దేశిత థియేటర్లలో ఈ చిత్రం 1.25 కోట్ల వసూళ్లు రాబట్టిందని ట్వీట్ చేశారు. ఈ సినిమా రెండో భాగం ఆరు నుంచి తొమ్మిది నెలల్లో థియేటర్లలోకి రానుంది.