ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 10 డిశెంబరు 2024 (22:26 IST)

పస్తులుండి పైకొచ్చా, మనోజ్ ఇక నువ్వు ఇంట్లో అడుగు పెట్టొద్దు: మోహన్ బాబు ఆడియో

mohan babu
టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు తన కుమారుడు మనోజ్‌ను ఉద్దేశించి ఆడియో విడుదల చేసారు. తన ముగ్గురు పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచాననీ, అందరికంటే మనోజ్ కే ఎక్కువ డబ్బులు ఖర్చు చేసానని అన్నారు. అలాంటిది తన గుండెల మీద తన్నినంత పని చేసాడనీ, సమాజంలో తన గౌరవ మర్యాదలు మంటగలిపాడని ఆవేదన చెందారు.
 
మోహన్ బాబు మాటల్లోనే.. మనోజ్‌.. నిన్ను అల్లారుముద్దుగా పెంచాను. నీ చదువు కోసం చాలా ఖర్చు పెట్టాను‌. నీ భార్య మాటలు విని నా గుండెలపై తన్నావ్‌. తాగుడుకు అలవాటుకు పడి చెడు మార్గంలో వెళ్తున్నావు. ఏదో ఒకటి రెండు పెగ్గులు తాగడం హద్దు కానీ నువ్వు తాగుడికి బానిసలా మారిపోయావు. పనిచేసే వాళ్లని కొడుతున్నావు. మనల్నే నమ్ముకుని వచ్చినవారిని కొట్టడం మహాపాపం రా. కుటుంబంలో గొడవలను కొన్ని మీడియా ఛానళ్లు రకరకాలుగా రాస్తున్నాయి. నేను ఆవేదన చెందుతున్నాను. అందుకే ఈ ఆడియో ద్వారా జరిగినది ఏమిటో తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. 
 
కొన్ని కారణాల వల్ల ఇద్దరు ఘర్షణ పడ్డాం. మనోజ్ నాపైన చేయి చేసుకోలేదు. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి‌. ఇంట్లో ఉన్న అందరినీ ఎందుకు కొడుతున్నావు‌. బతుకుదెరువు కోసం వచ్చిన పనివాళ్లను కొట్టడం మహాపాపం. నీ దాడిలో కొందరికి గాయాలయ్యాయి, అయినా కాపాడాను. అన్నతో పాటు వినయ్‌ను కొట్టడానికి వచ్చావు. నీ అన్నను చంపుతానని అన్నావు. నా ఇంట్లోకి అడుగుపెట్టడానికి నీకు అధికారం లేదు. ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు. ఈ ఇల్లు ఎవరికి రాయాలన్నది నా ఇష్టం. 
 
ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా, వద్దా అనేది నా ఇష్టం. పిల్లలకు ఇస్తానా.. దానధర్మాలు చేస్తానా అనేది నా ఇష్టం. మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వలేదు, నాకు జన్మనిచ్చాడు. మదరాసులో ఒక్కపూట తిని పస్తులుండి కష్టపడి సినిమాల్లో అవకాశాల కోసం ఎంతగానో కష్టపడిన రోజులు గడిపాను. ఐనా ఎవర్నీ మోసం చేయలేదు. కష్టించి పైకి వచ్చాను. అటువంటిది ఇది నా ఇల్లు అంటున్నావు. ఇది నీ ఇల్లు కాదు. నేను కష్టపడి సంపాదించుకున్నది.
 
నా ఇంట్లోకి నువ్వే అక్రమంగా చొరబడ్డావ్, నా మనుషులను కొట్టావ్. నాకు రక్షణ కావాలని పోలీసులను కోరాను. వాళ్లు ఇంతవరకూ స్పందించలేదు. ఐనా ఆ డిపార్టుమెంటును నేను గౌరవిస్తాను. ఇక జర్నలిస్టులకు నా గురించి పూర్తిగా తెలుసు. నా నటన బాగో లేకపోతే ఫెయిలయ్యానని రాయండి కానీ నా ఇంట్లో వ్యవహారాన్ని ఎలాబడితే అలా రాయకండి. మీకు నమస్కారాలు. 
 
మనోజ్... వింటున్నావా... నీ కూతురును వచ్చి తీసుకెళ్లు, నా దగ్గర వదిలిపెట్టినా ఇబ్బంది లేదు. జరిగిన సంఘటనతో మీ అమ్మ ఆస్పత్రిలో చేరింది. మీ అమ్మ వచ్చిన తర్వాత నీ కుమార్తెను ఆమెతో పంపిస్తాను. ఇక ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టు" అంటూ చెప్పారు.