"మిస్టర్ కూల్" నా రోల్ మోడల్... సాయం చేసే గుణమెక్కువ : మిస్ దివా
మిస్ దివా 2018 రన్నరప్‌గా రోషిణి నిలిచారు. ఆ తర్వాత ఆమెను మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే తనకు చెప్పలేనంత ఇష్టమని చెప్పుకొచ్చింది.
ముంబై వేదికగా ఆదివారం రాత్రి మిస్ విదా దివా పోటీలు జరిగాయి. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా బాలీవుడ్ నటులు శిల్పా శెట్టి, మలైకా అరోరా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లు వ్యవహరించారు. ఈ సందర్భంగా 'నీ రోల్ మోడల్ ఎవరు?.. వారిని ఎందుకు ఎంచుకున్నావ్?' అంటూ రన్నరప్ రోషిణిని మలైకా ప్రశ్నించింది.
దీనిపై ఆమె ఏమాత్రం తడుముకోకుండా ధోనీ పేరు చెప్పింది. ఆటలో అతడు చాలా కూల్‌గా ఉంటాడని, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటాడని, సహచరులను ఎంతగానో ప్రోత్సహిస్తాడని, అతడికి సాయం చేసే గుణం ఎక్కువని చెప్పుకొచ్చింది.
నిజానికి ఆమె ఎవరైన మహిళ పేరు చెబుతుందని భావించారు. కానీ, ధోనీ పేరు చెప్పడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఫైనల్‌లో రోషిణి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.