గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2024 (09:58 IST)

మలయాళ విలన్ నటుడు మోహన్ రాజ్ ఇకలేరు...

mohanraj
మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన మోహన్ రాజ్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఇటీవల ఆయన గుండెపోటు గురయ్యారు. దీంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. అక్కడ ప‌రిస్థితి విష‌మించ‌డంతో గురువారం ఆయ‌న‌ తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు వెల్ల‌డించారు.
 
మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో రెండు వంద‌లకుపైగా చిత్రాల్లో ఆయన నటించారు. మోహ‌న్‌లాల్ హీరోగా 1989లో వ‌చ్చిన కిరీడామ్ అనే సినిమాతో మోహ‌న్‌రాజ్ మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో కిరిక్కాడామ్ జోస్ అనే గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో మోహ‌న్‌రాజ్ త‌న విల‌నిజంతో ప్రేక్షకులను భ‌య‌పెట్టారు.
 
ఈ సినిమా మోహ‌న్ రాజ్ సినీ జీవితాన్ని మ‌లుపుతిప్పింది. కిరిక్కాడాన్ జోస్‌గానే అత‌డు పాపుల‌ర్ కావ‌డంతో ఆ పేరుతోనే చాలా సినిమాలు చేశారు. మ‌ల‌యాళంలో స్టార్ విల‌న్స్‌లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు. మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టితో పాటు మ‌ల‌యాళ అగ్ర న‌టీన‌టులంద‌రితో సినిమాలు చేశారు. 1990 నుంచి 2008 వ‌ర‌కు బ్రేక్ లేకుండా యేడాదికి ఐదారు సినిమాలు చేస్తూ వ‌చ్చారు. 1990లో వ‌చ్చిన రౌడీయిజం న‌శించాలి మూవీతో మోహ‌న్‌రాజ్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బాల‌కృష్ణ హీరోగా న‌టించిన లారీ డ్రైవ‌ర్ సినిమాలో గుడివాడ రౌడీ పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యారు. 
 
లారీ డ్రైవ‌ర్ త‌ర్వాత తెలుగులో బిజీగా మారారు. తెలుగులో ఎక్కువ‌గా బాల‌కృష్ణ‌, మోహ‌న్‌బాబు, వెంక‌టేష్‌ సినిమాల్లో విల‌న్‌గా క‌నిపించారు. బాల‌కృష్ణ, మోహ‌న్‌రాజ్ కాంబోలో తెలుగులో నిప్పు ర‌వ్వ‌, బొబ్బిలి సింహం, లారీ డ్రైవ‌ర్‌, రౌడీ ఇన్స్‌పెక్ట‌ర్‌, ప‌విత్ర ప్రేమ‌, స‌మ‌ర సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు, చెన్న‌కేశ‌వ‌రెడ్డితో పాటు ప‌లు సినిమాలొచ్చాయి. అసెంబ్లీ రౌడీ, చిన‌రాయుడు, శివ‌య్య‌, శ్రీరాముల‌య్య‌, పెళ్లిచేసుకుందాం, రాఘ‌వేంద్ర‌, శివ‌శంక‌ర్‌తో తెలుగులో ప‌లు సినిమాల్లో విల‌న్ పాత్ర‌లు చేశారు.
 
న‌టుడిగా మోహ‌న్‌రాజ్ చివ‌రి మూవీ రోషాక్‌. 2022లో మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన ఈ మూవీలో హీరోయిన్ తండ్రిగా క‌నిపించారు. ఆ త‌ర్వాత అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా సినిమాల‌కు దూర‌మ‌య్యారు. సినిమాల్లోకి రాక‌ముందు మోహ‌న్‌రాజ్ క‌స్ట‌మ్స్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌లో ఏఈవోగా వ‌ర్క్‌చేశారు. ఆ త‌ర్వాత సినిమాల‌తో బిజీ కావ‌డంతో ఉద్యోగానికి దూర‌మ‌య్యారు. మోహ‌న్‌రాజ్‌కు భార్య ఉష‌తో పాటు ఇద్ద‌రు కుమార్తులు ఉన్నారు.