శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (22:05 IST)

హుందాతనాన్ని నిలబెట్టుకోండి.. గౌరవప్రదంగా వ్యవహరించండి : ఎస్ఎస్ రాజమౌళి

ssrajamouli
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, సమంత - అక్కినేని నాగ చైతన్య విడాకుల అంశం తెలుగు చిత్రపరిశ్రమను కుదిపేస్తుంది. సమంత విడాకులతో పాటు అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ ముక్తకంఠంతో ఖండించారు. ఈ క్రమంలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియజేశారు. 'హుందాతనాన్ని నిలబెట్టుకోండి. గౌరవప్రదంగా వ్యవహరించండి. నిరాధార ఆరోపణలు సహించలేనివి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధులు చేసినప్పుడు' అని పోస్ట్‌ పెట్టారు. 
 
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి సురేఖ బుధవారం విమర్శలు గుప్పించారు. కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని కెరీర్‌ని ముగించడానికి, అక్కినేని నాగార్జున ఫ్యామిలీలో చోటుచేసుకున్న పరిస్థితులకూ కేటీఆరే కారణమనడంతో పెద్ద దుమారం చెలరేగింది. 
 
రాజకీయ లబ్ధి కోసం సినిమా వాళ్లను టార్గెట్‌ చేయడం సిగ్గుచేటంటూ టాలీవుడ్‌ హీరోలు, నిర్మాతలు, దర్శకులు సోషల్‌ మీడియా వేదికగా మండిపడ్డారు. అక్కినేని కుటుంబం సైతం మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠ దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున పరువు నష్టం దావా కూడా వేశారు.
 
మరోవైపు, తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని సురేఖ గురువారం ఉదయం మీడియా ద్వారా వెల్లడించారు. కేటీఆర్‌పై విమర్శలు చేసే క్రమంలో అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. తనకు ఎవరిమీద వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్టు చూసి చాలా బాధపడినట్లు తెలిపారు.