ఆదివారం, 19 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (22:20 IST)

రజనీకాంత్ 'వేట్టయన్' చిత్రం విడుదలపై స్టే విధించండి : హైకోర్టులో పిటిషన్

vettaiyan
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయన్. ఈ నెల 10వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్ బుధవారం విడుదల చేశారు. టీజే జ్ఞానవేల్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. అయితే, ఈ చిత్రంలో ట్రైలరులో సంభాషణలు చట్టవిరుద్ధంగా ఎన్‌కౌంటర్లను ప్రోత్సహించేలా ఉన్నాయని పేర్కొంటూ ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. 
 
'అత్యంత భయంకరమైన క్రిమినల్స్‌ను ఏమాత్రం భయపడకుండా ఎన్‌కౌంటర్‌ చేయడం వల్ల వీళ్లు హీరోలు అయ్యారు' అంటూ కొన్ని సంభాషణలు ఉండటంపై సదరు పిటిషనర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అవి చట్టవిరుద్ధ ఎన్‌కౌంటర్‌లు ప్రోత్సహించేలా ప్రజల ఆలోచనా దృక్పథాన్ని మార్చేలా ఉన్నాయన్నారు. ఆ సంభాషణలను తొలగించడం లేదా మ్యూట్‌ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ సుబ్రమణియన్‌, జస్టిస్‌ విక్టోరియా గౌరీల ధర్మాసనం సీబీఎఫ్‌సీ (కేంద్ర చలన చిత్ర సెన్సార్‌ బోర్డు), నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు నోటీసులు జారీ చేసింది. సినిమాపై మధ్యంతర నిషేధం విధించాలన్న విన్నపాన్ని మాత్రం తోసిపుచ్చింది. సీబీఎఫ్‌సీ, లైకా ప్రొడక్షన్స్‌ స్పందనను బట్టి తదుపరి విచారణ ఉంటుందని తెలిపింది.