మంగళవారం, 12 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (09:36 IST)

తనపై హానీ ట్రాప్ జరిగింది.. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

koneti adimulam
తనపై టీడీపీ మహిళా నేత చేసిన లైంగిక వేధింపులను కొట్టివేయాలంటూ టీడీపీ నుంచి సస్పెండ్‌కు గురైన తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తనపై హానీ ట్రాప్ జరిగిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
తనపై చేసిన అభియోగాలకు సంబంధించి ఎలాంటి ప్రాధమిక విచారణ లేకుండా, ఆరోపణల్లో నిజానిజాలపై దర్యాప్తు జరపకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. జులై, ఆగస్టు నెలల్లో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా ఇప్పుడెందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటన హానీ ట్రాప్‌గా ఎమ్మెల్యే ఆదిమూలం అభివర్ణించారు. 72 సంవత్సరాల వయసు ఉన్న తనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో గుండెకు స్టెంట్ వేయించుకున్నట్లు క్వాష్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
 
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఇటీవల టీడీపీ మహిళా నేత లైంగిక ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారిన విషయం తెల్సిందే. ఆదిమూలంపై పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేయడంతో పాటు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలకు సంబంధించి పెన్ కెమెరాతో రికార్డు చేసిన దృశ్యాలను సాక్ష్యాలుగా ఆ మహిళా నేత బయట పెట్టారు. 
 
ఎమ్మెల్యే ఆదిమూలం తనను హోటల్ గదికి పిలిపించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళా నేత మీడియా ముందు చెప్పారు. దీంతో పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేసింది. మరో పక్క ఆ మహిళా నేత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.