శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2017 (14:16 IST)

సరైన గైడెన్స్ లేదు.. తెలివిలేక మా అమ్మ తాగుబోతు అయింది : మహానటి సావిత్రి కుమార్తె

తెలుగు వెండితెరను ఏలిన మహారాణి. పేరు సావిత్రి. అందంతో పాటు అభినయంతోనూ అందరినీ ఆమె అలరించారనడంలో సందేహంలేదు. అందుకే ఆమె మహానటి అయింది. ఇప్పుడు ఆమె జీవితగాథ తెరపై ఆవిష్కృతమవబోతోంది.

తెలుగు వెండితెరను ఏలిన మహారాణి. పేరు సావిత్రి. అందంతో పాటు అభినయంతోనూ అందరినీ ఆమె అలరించారనడంలో సందేహంలేదు. అందుకే ఆమె మహానటి అయింది. ఇప్పుడు ఆమె జీవితగాథ తెరపై ఆవిష్కృతమవబోతోంది. ఈ నేపథ్యంలో సావిత్రి కుమార్తె చాముండేశ్వరి ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె అనేక విషయాలను వెల్లడించారు. సావిత్రి బయోపిక్‌ తీయడానికి రెండు కండీషన్లు పెట్టినట్టు తెలిపారు. ఈ కండీషన్‌కు దర్శకుడు నాగ్ అశ్విన్ సమ్మతించడం వల్లే వెండితెర దృశ్యాకావ్యానికి సమ్మతించినట్టు చెప్పారు. అంతేకాకుండా, తన తల్లి గురించి, ఆమె పడిన కష్టాల గురించి కూడా ఆమె అనేక విషయాలను వెల్లడించారు. 
 
"తనకు 16 ఏళ్ల వయసులో పెళ్లైంది. నా పెళ్లికి రెండేళ్ల ముందే అమ్మ.. నాన్నల మధ్య విభేదాలు ఉండేవన్నారు. వారిద్దరి మధ్య ఉన్న గొడవలు నాకు అర్థమయ్యేవి కావు. అమ్మ.. నాన్నలిద్దరూ నాతో ఎప్పుడూ టచ్‌లోనే ఉండేవారు. మా నాన్న ఇంట్లో ఉండకపోయినా.. ఎప్పుడూ ఆయన ఇంటికి నేను వెళుతుండేదాన్ని. ఆ తర్వాతే అసలేం జరుగుతోందో తెలిసేది. వారిద్దరి గొడవల వల్ల ఎక్కువ ఇబ్బంది పడింది మాత్రం చాలా చిన్నవాడైన నా సోదరుడే. అయితే.. అతడు పెరిగి పెద్దయ్యే నాటికి ఆ గొడవలన్నీ సద్దుమణిగాయి. 
 
ఇక, అమ్మ విషయానికొస్తే.. ఆమె చాలా అమాయకురాలు. తనకొచ్చే ఇబ్బందులను ఎలా డీల్ చేయాలో కూడా ఆమెకు అస్సలు తెలియదు. అంత తెలివితేటలు కూడా ఆమెకు లేవు. అంత అమాయకురాలు. అదే ఆమెకు చాలా చెడు చేసింది. ఇక, సరైన గైడెన్స్ కూడా ఆమెకు ఎవ్వరూ ఇవ్వలేదు. ఆ గైడెన్స్ లేక, సమస్యలను ఎదుర్కొనే తెలివి లేక.. మా అమ్మ మద్యానికి బానిసైంది. ఆ తర్వాత దాదాపు 19 నెలలు అమ్మ కోమాలోకి వెళ్లిపోయింది. అమ్మ తప్పకుండా బతుకుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ, మా ఆశలపై నీళ్లుజల్లుతూ ఆమె కన్నుమూసిందని చెప్పారు.
 
అమ్మ బెడ్‌పై ఉన్ 19 నెలలు పాటు నరకం అనుభవించింది. ఇక, అమ్మ చివరి రోజుల్లో అమ్మ వెంటే నాన్న ఉన్నారు. ఆ టైంలో నాన్న అనుభవించిన బాధ కూడా అంతా.. ఇంతా కాదు. అయితే, నిజానికి వారిద్దరి మధ్యా ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ... చివరి రోజుల్లో మాత్రం అమ్మను చూసి చాలా చలించిపోయారాయన. ఆమె చనిపోయాక కూడా మేము ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేదని తెలిపింది. అమ్మ ఎంత పోగొట్టుకున్నా.. అంతకన్నా ఎక్కువే సంపాదించారన్నారు. అమ్మ చనిపోయాక కూడా ఈ స్థితిలో ఉన్నామంటే అంతా అమ్మ చలవే' అని విజయ చాముండేశ్వరి వివరించారు.