బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (15:42 IST)

నాగశౌర్యకు దెబ్బమీద దెబ్బ.. పట్టాలుతప్పిన మరో సినిమా!

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తనకంటూ ఒక హీరో గుర్తింపుని తెచ్చేసుకున్న నటుడు నాగశౌర్య. ఆ తర్వాత 'దిక్కులు చూడకు రామయ్య', 'జ్యో అచ్యుతానంద', 'ఛలో' వంటి సినిమాలతో తన ఇమేజ్‌ను మరింతగా పెంచుకున్నాడు. ఇదే ఊపులో వరుస పెట్టి సినిమాలను కూడా అంగీకరించేసాడు. అయితే, ఇటీవలికాలంలో వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో నాగశౌర్య ఇబ్బందుల్లో పడ్డాడు. ఇప్పటికే వరుస పరాజయాలతో ఢీలా పడిన నాగశౌర్యకు దెబ్బమీదదెబ్బ తగులుతోంది. నాగశౌర్య అంగీకరించిన ఒక్కో సినిమా అతని చేతుల్లో నుండి జారిపోతూన్నాయి. 
 
ఇప్పటికే సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోగా... తాజాగా మరో సినిమా కూడా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. నాగశౌర్య హీరోగా ఆనంద్ ప్రసాద్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ సంస్థ గత ఏడాది ఒక సినిమాను ప్రారంభించింది. దీనికి వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను కూడా కూకట్‌పల్లిలోని ఓ ఆలయంలో లాంఛనంగా ప్రారంభించారు. 
 
అయితే, ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయిందని వినికిడి. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'ఓ బేబీ' సినిమాలో నాగశౌర్య నటిస్తున్నారు. ఇది షూటింగ్ దశలో ఉంది. ఇలా చూస్తే.. నాగశౌర్య ఖాతాలో ఇదికాకుండా అవసరాల శ్రీనివాస్‌తో చేయబోయే మరో సినిమా మాత్రమే ఉందట. మరి తన ఇమేజ్ మళ్లీ ఎప్పటికి పుంజుకుంటుందో వేచి చూడాల్సిందే.