కోలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ కన్నుమూత
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ దర్శక దిగ్గజం జె.మహేంద్రన్ కన్నుమూశారు. ఈయన వయసు 79 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు జాన్ మహేంద్రన్ వెల్లడించారు.
ఈయన అనేక హిట్ చిత్రాలను తెరకెక్కించారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు గుర్తింపునిచ్చిన దర్శకుల్లో ఈయన ఒకరు. మహేంద్రన్ దర్శకత్వంలో 'ముల్లుమ్ మలరుమ్', 'జానీ', 'నెంజతై కిల్లాడే' వంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు మహేంద్రన్‌కి ఎంతగానో పేరు తెచ్చిపెట్టాయి.
నటుడిగాను పలు చిత్రాలలో నటించిన ఆయన రీసెంట్‌గా విజయ్ సేతుపతి 'సీతాకాతి', రజనీకాంత్ 'పేటా' వంటి చిత్రాల్లో నటించారు. పైగా, 2018లో ఆయన జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన మరణంతో తమిళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని పలువురు ప్రముఖులు ఆ దైవాన్ని కోరుతున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.