నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం పేరు 'అంటే... సుందరానికి'

ante sundaraniki
ఠాగూర్| Last Updated: ఆదివారం, 22 నవంబరు 2020 (09:25 IST)
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. అయితే, ఈ మూవీ టైటిల్‌తో పాటు.. లోగోను శనివారం వెల్లడించారు. ఈ చిత్రానికి "అంటే.. సుందరానికి" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నాని కథానాయకుడిగా నటిస్తున్న 28వ చిత్రమిది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్నారు. మలయాళ బ్యూటీ నజ్రియా ఫహాద్‌ ఈ సినిమా ద్వారా తెలుగులో ఆరంగేట్రం చేస్తోంది.

ఈ టైటిల్‌ ప్రకటన సందర్భంగా చిత్ర బృందం డైలాగ్‌ వీడియోను విడుదల చేసింది. ఇందులో నాని ఓ వ్యక్తితో రహస్యంగా చెవిలో ఓ ముచ్చటను పంచుకోవడం.. అనంతరం సదరు వ్యక్తి అంటే.. సుందరానికి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించడం ఆసక్తికరంగా అనిపిస్తోంది.

'ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే చిత్రమిది. కుటుంబ నేపథ్యంలో అందరిని అలరిస్తుంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించే
సినిమా ఇది' అని చిత్రం బృందం పేర్కొంది.

ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నికేత్‌ బొమ్మి, సంగీతం: వివేక్‌సాగర్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: లతా అరుణ్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ వై, రచన-దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ.
దీనిపై మరింత చదవండి :