షార్ట్ ఫిల్మ్ -దారి కి జాతీయ స్థాయిలో మరో ప్రెస్టీజియస్ అవార్డ్
సురేశ్‌రాజ్ దర్శకత్వంలో తెలుగువన్ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ 'దారి' జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకుంది. ఇప్పటికే వివిధ పోటీలో పలు అవార్డులను సొంతం చేసుకున్న `దారి` తాజాగా బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి షార్ట్ ఫిలిమ్స్ పోటీ 2021-22లో ఫస్ట్ బెస్ట్ స్టోరీ అవార్డును అందుకోవడం విశేషం. ఇండియన్ ఫిల్మ్ హౌస్ ఆధ్వర్యంలో ఈనెల 6న జరిగిన ఈ పోటీలో అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని సురేశ్‌రాజ్ అందుకున్నాడు.
మద్యానికి బానిసైన ఒక తండ్రి, చదువుకుంటానన్న కొడుకును ఎలా బాధపెట్టాడు, చివరకు చదువు ఆవశ్యకతను ఎలా తెలుసుకున్నాడనే పాయింట్‌తో హృదయాన్ని స్పృశించే సన్నివేశాలతో 'దారి' లఘుచిత్రాన్ని సురేశ్‌రాజ్ రూపొందించాడు. నాణ్యమైన వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ నిర్మించడం ద్వారా జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన తెలుగువన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఇంతకుముందు, షార్ట్ ఫిలిమ్స్‌కు జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడంలో పేరుపొందిన 'క్లబ్బీ' నిర్వహించిన పోటీలో 'దారి'కి ఉత్తమ లఘుచిత్రంగా ప్రథమ బహుమతి లభించడం గమనార్హం.
అంతే కాదు, వికారాబాద్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కళాజాత బృందాలు 'దారి' షార్ట్ ఫిల్మ్‌ను ఊరూరా ప్రదర్శించడం దానికి దక్కిన అపూర్వ గౌరవం. మద్యపానం వల్ల కలిగే అనర్థాలు, పిల్లల చదువు ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఈ షార్ట్ ఫిల్మ్‌ను వారు ప్రదర్శించారు. తెలుగువన్ సంస్థ అధినేత కంఠంనేని రవిశంకర్ ప్రోత్సాహం, సహాయ సహకారాలతో తాను 'దారి' లాంటి ప్రయోజనాత్మక లఘు చిత్రాన్ని తీయగలిగాననీ, భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ చిత్రాలు తీయడానికి కృషి చేస్తాననీ సురేశ్‌రాజ్ చెప్పాడు.