అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖ- ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూన్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీరామ్ మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు.
ఈ కథ మీద దగ్గరకు ఎలా వచ్చింది? కథ విన్న తర్వాత మీ స్పందన ఏంటి?
'టెన్త్ క్లాస్ డైరీస్'తో దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాటోగ్రాఫర్ అంజి గారితో నాకు పరిచయం ఉంది. తమిళంలో నాతో ఒక ప్రాజెక్ట్ చేయాల్సింది. అప్పుడు నా డేట్స్ కుదరలేదు. సినిమా చేయలేదు. అప్పుడు అంజి గారితో 'మీరు దర్శకుడిగా చేసే ఫస్ట్ ప్రాజెక్ట్ నా దగ్గరకు తీసుకు రావాలి'' అని చెప్పాను. ఒక కథ ఉందని చెబితే... హైదరాబాద్ వచ్చి కలిశా. ఫర్ ఎ చేంజ్... దర్శకుడు కథ చెప్పలేదు. నిర్మాత అచ్యుత రామారావు గారు కథ చెప్పారు. ఆ తర్వాత తెలిసింది... ఆయనే కథ రాశారని! కథ విన్న వెంటనే 'మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా?' అని అడిగా. అప్పుడు రామారావు ఎమోషనల్ అయ్యారు. మా బ్యాచ్ లో జరిగిందని చెప్పారు. ఆయన టెన్త్ బ్యాచ్ రీ యూనియన్ తర్వాత జరిగిన సంఘటనలే ఈ 'టెన్త్ క్లాస్ డైరీస్'. అయితే, కొంత ఫిక్షన్ ఉంది. సినిమాలో క్యారెక్టర్లు ఎవరో ఒకరు రిలేట్ చేసుకునేలా ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో స్కూల్ డేస్ మెమొరబుల్ మూమెంట్స్. అటువంటి మూమెంట్స్ ను పిక్చరైజ్ చేశాం.
ఒక రకంగా రీ యూనియన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకోవచ్చా?
ఎస్. బేసిక్ కంటెంట్... రీ యూనియన్. హరిశ్చంద్రుడు అయినా, రాముడు అయినా ఇంకొకరి జీవితంలో విలన్ అనుకోవచ్చు. ఏదో ఒక తప్పు జరిగి ఉంటుంది. మన జీవితంలో కరెక్టుగా ఉన్నా ఇంకొకరి జీవితంలో చెడ్డోళ్లు అవుతాం. తెలిసో తెలియకో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అటువంటి ఒక తప్పు వల్ల ఎంత మంది జీవితం ఎలా మారుతుందనేది కాన్సెప్ట్. రియాలిటీగా తీశాం. ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా చూసుకున్నాం. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా ఎంటర్టైనింగ్ రోల్స్ కావడంతో ఈజీ అయ్యింది. ఒక మనిషి అఘోర అయ్యారు. ఆయన రీ యూనియన్ కి అలాగే వచ్చారు.
రీ యూనియన్ మీద మీ అభిప్రాయం?
ప్రతిసారీ, ప్రతి చోట రీ యూనియన్ సక్సెస్ అని చెప్పలేం. మేం ట్రై చేశాం. వంద మందిలో ఎనిమిది మంది వచ్చారు. నేను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ భవన్స్ స్టూడెంట్. ఒకసారి మా వాళ్ళు ప్లాన్ చేశారు. రావడానికి రెడీ అయ్యా. చివరి క్షణంలో షూటింగ్ పెట్టారు. 'డబ్బులు కట్టేశాం. మళ్ళీ ఆ లొకేషన్ దొరకదు. ఆర్టిస్టుల డేట్స్ లేవు' అని అనడంతో మిస్ అయ్యా.
రీ యూనియన్స్ అంటే హ్యాపీ మూమెంట్స్ ఎక్కువ. జీవితం అలా ఉండదు కదా! మీ సినిమాలో ఏం చూపించారు?
రీ యూనియన్స్ లో చాలా మంది స్నేహితులు కలుస్తారు. అయితే, అందరూ తమ ప్రయివేట్ లైఫ్ షేర్ చేసుకోరు. బావున్నానని చెబుతారు. క్లోజ్ అయిన వాళ్ళ దగ్గర మాత్రమే ఓపెన్ అవుతారు. మా సినిమాలో అన్నీ చూపించాం. అయితే, కొంత లైటర్ వీన్ లో చూపించాం.
అవికా గోర్, మీ మధ్య సన్నివేశాలు... మీ కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది?
చాందిని పాత్రలో అవికా గోర్ నటించారు. చాందిని కోసం అన్వేషించడమే సినిమా. ఎప్పుడు కలుస్తామో మీరు ఊహించుకోవచ్చు.
తమిళ్ హిట్ '96'కి దగ్గరగా ఉంటుందా?
రెండూ వేర్వేరు సినిమాలు. అయితే, ఫ్లాష్ బ్యాక్ సీన్స్‌లో కొంత సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయేమో? అలా అంటే... '96'కి ముందు 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్' వచ్చింది. అందులో కొన్ని సీన్స్ ఉన్నాయి కాదు! అలాగే, 'ప్రేమమ్' సినిమా. స్కూల్, కాలేజీలో ఏం జరిగిందనేది చూపించినప్పుడు కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి.
సినిమాటోగ్రాఫర్ దర్శకుడు అయితే... పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి?
రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్. దర్శకుడిగా ఆయన మొదటి సినిమాలో నేనే హీరో. కేవీ ఆనంద్ కోసం దర్శకుడు శంకర్ వెయిట్ చేస్తున్నారు. శంకర్ సినిమా వదులుకుని మరీ నా సినిమాకు కేవీ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ అంజి నాతో సినిమా చేయాలనుకున్నారు. కొంత మంది పెద్ద పెద్ద సినిమాటోగ్రాఫర్స్ నా దగ్గరకు వచ్చారు. వాళ్ళ కథలు నాకు నచ్చలేదు. నేను చేయలేదు. సినిమాటోగ్రాఫర్స్ కొన్నిసార్లు విజువల్ బ్యూటీ చూస్తారు. అది పాటల్లో చూడొచ్చు. కథ ఎక్కడ? కొన్నిసార్లు అది మిస్ అవుతుంది. సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ అయితే కమర్షియల్ సినిమా తీయాలి. ఆరు నుంచి అరవై దాకా అందరూ చూసే సినిమా చేయమని వాళ్ళను కోరుతున్నా. కామెడీ, ఎమోషన్, ఫీలింగ్స్... అన్నీ ఉండాలి. అంజి నైస్ ఎంటర్టైనింగ్ కమర్షియల్ సినిమాతో వచ్చారు. ఇదొక ఫీల్ గుడ్ ఫిల్మ్. ఇందులో లవ్, ఫ్రెండ్షిప్, హ్యూమర్... అన్నీ ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్స్ కూడా! 'టెన్త్ క్లాస్ డైరీస్' అనేది పర్ఫెక్ట్ ప్యాకేజీ ఉన్న కమర్షియల్ సినిమా. 'ఒకరికి ఒకరు' తర్వాత నాకు సంతృప్తి ఇచ్చిన చిత్రమిది. కొన్ని సినిమాల్లో హీరో సపోర్టింగ్ రోల్స్ చేశా. అవి పక్కన పెడితే... ఇది సంతృప్తి ఇచ్చింది. ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయి. షూటింగ్ చేసేటప్పుడు ట్రిప్ కి వెళ్లినట్టు ఉంది. మా నిర్మాత, కథ రచయిత రామారావు గారు ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్ చేశారు. ప్రొడక్షన్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. కొలంబో, మియామిలో కూడా కొన్ని సీన్స్ షూట్ చేశాం. అలాగే, సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. శివ బాలాజీ, మధుమిత భార్యాభర్తలుగా నటించారు.
: 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. ఇప్పుడు?
అటువంటి రోల్స్ రిజెక్ట్ చేస్తున్నాను. అవి చేస్తే టైప్ కాస్ట్ అయిపోతాం. ఈ వారంలో అటువంటి రోల్స్ మూడు వస్తే వద్దని చెప్పాను. నాకు క్లోజ్ అయినవాళ్లు అడిగితే చేస్తున్నా. రవితేజ గారితో ఇంతకు ముందు నటించా. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'రావణాసుర'లో ఒక పాత్ర చేయమని అడిగారు. అది చేస్తున్నాను. ప్రతి సినిమాలో అటువంటి రోల్స్ చేయను. నాకు తెలుగు సినిమాలు చేయాలని ఉంది. మంచివి వస్తే చేస్తా. లేదంటే తమిళంలో నాకు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆరు తమిళ సినిమాలు పూర్తి చేశా. 'రెక్కీ' అని వెబ్ సిరీస్ చేశా. జీ 5లో ఈ నెల 17న రిలీజ్ అవుతోంది.
తెలుగులో ఇంకేం సినిమాలు చేస్తున్నారు?
అంజితో ఒక సినిమా గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. నా కోసం రసూల్ కూడా ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు.