లైగర్‌లో ప్రభుదేవా నటిస్తున్నాడా? పిక్ వైరల్
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం లైగర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఇస్మార్ట్ శంకర్ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో లైగర్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ఈ సారి పాన్ ఇండియా లెవల్లో వస్తున్నాడు. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. లైగర్ తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదల కానుంది. విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది. ఇందులో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నాడు.
ఈ చిత్రాన్ని పూరి భారీ స్థాయిలో దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఇప్పటికే 80 శాతం వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది.
అయితే తాజాగా మరోవార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ డ్యాన్సర్, నటుడు ప్రభుదేవా నటించనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ప్రభుదేవా లైగర్ బృందంతో కలిసి దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ సినిమాలో ప్రభుదేవా నటిస్తున్నాడా లేదా సాంగ్‌కు కొరియోగ్రఫీ చేయనున్నాడా అనేది తెలియదు. దీనిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది.
అలాగే ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు తెలుస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.