ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (18:05 IST)

ప్రీమియర్ షోలకు హిట్‌లతో సంబంధం లేదు - లక్కీ భాస్కర్ ముందు రోజు ప్రీమియర్ : సూర్యదేవర నాగవంశీ

Venky Atluri, Nagavamshi
Venky Atluri, Nagavamshi
1980లో జరిగిన బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంగా ఇప్పటి తరానికి అర్థమయ్యేలా లక్కీ భాస్కర్ చిత్రం రాబోతుంది.  డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. 
 
ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ నెల 21వ తేదీన ట్రైలర్ విడుదల చేయబోతున్నాం. అప్పటినుంచి అందరం ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాలుపంచుకుంటాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటిదాకా నేను తీసిన సినిమాల్లో ఇది విభిన్న చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నాను." అన్నారు.
 
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. "దేవర మరియు ఇతర దసరా సినిమాల హడావుడి పూర్తయ్యాక ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాలని ఉద్దేశంతో ఇప్పటిదాకా ఆగాము. ఇక నుంచి వరుసగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాము. అక్టోబర్ 21న ట్రైలర్ విడుదల చేస్తాము. అక్టోబర్ 26 లేదా 27 తేదీల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నాము. అక్టోబర్ 30 నుంచి ప్రీమియర్లు ప్రదర్శించనున్నాము. సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాము. అందుకే ముందు రోజు సాయంత్రం నుంచే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించాము." అన్నారు.
 
ఈ సందర్భంగా విలేఖర్లు అడిగిన పలు ప్రశ్నలకు దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ బదులిచ్చారు.
 
దేవర అర్థరాత్రి షోలు వేయడం వల్ల లాభమా? నష్టమా?
నాగవంశీ: సినిమా విజయం సాధించింది అంటే లాభమనే చెప్పాలి కదా. పైగా దేవర అర్థరాత్రి షోలు వేయడం వల్ల నాకో విషయం అర్థమైంది. అదేంటంటే అర్థరాత్రి షోలకు వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా, సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. "లక్కీ భాస్కర్" విషయానికి వస్తే.. అర్థరాత్రి షోలు కాకుండా, ముందురోజు సాయంత్రం నుంచే సాధారణ షోలు ప్రదర్శించబోతున్నాము.
 
"లక్కీ భాస్కర్" సినిమా ఎలా ఉండబోతుంది?
నాగవంశీ: భారీ సినిమా అని చెప్పను కానీ, ఈ మధ్య కాలంలో రూపొందిన గొప్ప తెలుగు సినిమాల్లో "లక్కీ భాస్కర్" ఒకటని ఖచ్చితంగా చెప్పగలను. కథ కొత్తగా ఉంటుంది. సాంకేతికంగా కూడా సినిమా గొప్పగా ఉంటుంది. ట్రైలర్ చాలా బాగా వచ్చింది. ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు పెరిగిపోతాయి. సినిమా మంచి వసూళ్లు రాబడుతుందనే నమ్మకం ఉంది.
 
"లక్కీ భాస్కర్" కథ ఎలా మొదలైంది?
వెంకీ అట్లూరి: నాకు తెలిసినంతవరకు ఇప్పటిదాకా బ్యాంకింగ్ సెక్టార్ మీద మన దేశంలో సరైన సినిమా రాలేదు. ఆ నేపథ్యంలో ఒక బలమైన కథతో సినిమా చేయాలని నాకు ఎప్పటినుంచో ఉంది. 1980-90 కాలంలో జరిగే కథ ఇది. వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకొని రాసుకున్న కల్పిత కథ. ఇప్పటివరకు నేను ఎక్కువ సమయం తీసుకొని రాసిన కథ ఇదే. ఈ కథ కోసం ఎంతో పరిశోధన చేశాను. తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఈ చిత్రం కొత్త అనుభూతిని ఇస్తుంది.
 
సంగీతం ఎలా ఉండబోతుంది?
వెంకీ అట్లూరి: జి.వి. ప్రకాష్ గారు నా గత చిత్రం 'సార్' కి అద్భుతమైన సంగీతం అందించారు. 'లక్కీ భాస్కర్'కి కూడా పాటల పరంగా, నేపథ్య సంగీత పరంగా అద్భుతమైన సంగీతం అందించారు.
 
సినిమా ఎన్ని భాషల్లో విడుదల కాబోతోంది?
నాగవంశీ: ఐదు భాషలు. హిందీలో ఒక వారం తర్వాత విడుదలవుతుంది.