భారతీయ సినిమాకి పీఠాధిపతి ఎస్ఎస్ రాజమౌళి: ఆచార్య ప్రి-రిలీజ్‌లో మెగాస్టార్ చిరంజీవి
chiru-Rajamouli and others
ఆచార్య సినిమా ప్రీ-రిలీజ్ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళిని ఆకాశానికెత్తేశారు చిరంజీవి. ఆయన మాట్లాడుతూ, రుద్రవీణ సినిమా చేశాం. దానికి నేషనల్ అవార్డు వచ్చింది. అక్కడ టీ తాగే టైంలో హాల్‌లో ఇండియన్ సినిమా గురించి చెబుతూ వున్న పోస్టర్లు వున్నాయి. బాలీవుడ్ సినిమాల గురించే ఎక్కువగా వున్నాయి. సౌత్ సినిమాగురించి ఎం.జి.ఆర్. గురించి ఫొటో పెట్టి రాసివుంది. అంతేకానీ తెలుగువారి గురించికానీ, కన్నడ నటీనటుల గురించి కానీ లేదు. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అనేది హైలైట్ చేశారు. చాలా బాధవేసింది. తెలుగు అంటే ప్రాంతీయ సినిమా అనేవారు.
కానీ తర్వాత తర్వాత నేను గర్వపడేలా రొమ్ము విరుచుకునేలా తెలుగు సినిమా హద్దులు ఎల్లలు చెరిపేసి.. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపరిచేలా బాహుబలి, ఆర్.ఆర్.ఆర్. సినిమాలు దోహదపడ్డాయి. దానికి కారణం రాజమౌళి. తెలుగువాడిగా గర్విస్తున్నా. రాజమౌళి తెలుగువాడు అవడం నభూతో నభవిష్యత్. జీవితాంతం తెలుగు పరిశ్రమ ఆయన్ను గుర్తుంచుకోవాలి. భారతీయ సినిమా మతం అయితే పీఠాధిపతి (డెమీ గాడ్) రాజమౌళి.. అందుకే ఆయన్ను సన్మానించుకుంటున్నానని తెలుపుతూ శాలువాతో సత్కరించారు.