కొరటాల చిత్రంలో రైతుగా చిరంజీవి.. అతిథి పాత్రలో చెర్రీ
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే యేడాది జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. అలాగే, మరో చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కే ఈ చిత్రంలో చిరంజీవి ఒక రైతుగా కనిపించనున్నారు. ఇందులో ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అతిథి పాత్రలో నటించనున్నారు.
ఇప్పటికే ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసిన కొరటాల, త్వరలో చిరంజీవికి వినిపించడానికి రెడీ అవుతున్నాడట. ఈ సినిమాలో చిరంజీవి పెద్దరికానికి తగినట్టుగానే ఆయన పాత్ర ఉంటుందన్నారు. రైతు పాత్రలో చిరంజీవిని చూపిస్తూ.. సామాజిక సందేశంతో ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. జనవరిలో పూజా కార్యక్రమాలు జరుపుకునే ఈ భారీ ప్రాజెక్టు పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
ఇక ఈ సినిమాలో ఒక సందర్భంలో చరణ్ కూడా కనిపించనున్నారు. చిరూ.. చరణ్‌లతో మాట్లాడిన తర్వాతనే కొరటాల ఆ సీన్ రాసుకున్నట్టు సమాచారం. గతంలో 'మగధీర', 'బ్రూస్లీ' సినిమాల్లో చరణ్‌తో కలిసి చిరంజీవి అభిమానులకి ఆనందాన్ని కలిగించారు. ఈసారి చిరూతో కలిసి చరణ్ మెరిసి అభిమానుల ముచ్చట తీర్చనున్నాడన్న మాట.