Ramcharan, Allu arjun : పుష్ప 2 వర్సెస్ గేమ్ ఛేంజర్ - కలెక్షన్లకు రేవంత్ రెడ్డి బ్రేక్?
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో నిర్మించిన భారీ చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాకు ముందు శంకర్ సినిమా కమల్ హాసన్ తో తీసింది డిజాస్టర్ గా నిలిచింది. భారతీయుడు 2 పెద్దగా ఆడకపోగా ఈ ఎఫెక్ట్ రామ్ చరణ్ సినిమాపై పడుతుందని అభిమానులు థియేటర్ల దగ్గర నిరుత్సాహ పడ్డారు. ట్రేడ్ వర్గాలు కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత డిసెంబర్ లో విడుదలకావాల్సిన ఆ సినిమాను జనవరి సంక్రాంతికి వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అప్పుడు పుష్ప 2 రిలీజ్ డేట్ లాక్ చేయడం, అనూహ్య స్పందన రావడంతో వెనక్కు వెళ్ళారని వార్తలు కూడా వచ్చాయి.
ఇటీవలే యు.ఎస్, డల్లాస్ లో గేమ్ ఛేంజర్ ప్రమోషన్ కు శ్రీాకారం చుట్టినట్లు రామ్ చరణ్ ప్రకటించాడు. అయితే అదేరోజు అల్లు అర్జున్ సంథ్య థియేటర్ వివాదం తెలంగాణ అసెంబ్లీ అనూహ్యంగా చర్చకు రావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది. దాంతో మీడియా అంతా వాటిపైనే ఫోకస్ చేసింది. ఆ వెంటనే రాత్రి పూట అల్లు అర్జున్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తనపై దుష్ప్రచారం జరుగుతుందనీ, అందులో వాస్తవాలు లేవని ప్రకటించాడు. తాను చాలా మానసిక వేదనతో వున్నాననీ, రేవతి కుటుంబాన్ని ఆదుకుంటానని ప్రకటించాడు.
ఈ ఇష్యూతో అసలు గేమ్ ఛేంజర్ సినిమా గురించి ప్రజలు ఆలోచించేస్థితిలో లేరు. ఇప్పటికి కూడా ఈ సినిమాపై పెద్ద అంచనాలు లేకపోవడం విశేషం. ఒకరకంగా యాద్రుశికమైనా అల్లు అర్జున్ ఇష్యూ చరణ్ సినిమాకు బ్రేక్ పడేలా వుందనీ అభిమానులు కూడా ఆలోచిస్తుండడం విశేషం. ఇకపై బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వననీ, టికెట్ల రేట్లు పెంచననీ రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించాడు. సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఓ కార్యక్రమంలో పాల్గొని స్పష్టం చేశారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తెలంగాణ నిర్మాత దిల్ రాజుకు ఎఫ్.డి.సి. ఛైర్మన్ పదవి వచ్చేలా చేసింది. మరి ఆయన నిర్మించిన సినిమాకు కలెక్లన్లను పెంచుకునే అవకాశం లేకుండా పోతుందా? లేదా? రూల్ సంక్రాంతి సినిమాలకు వర్తించదంటారో చూడాల్సిందేనంటూ ఫిలింనగర్ లో చర్చ జరుగుతెోంది. ఏమి జరుగుతుందో చూడాలి.