సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

వెబ్ సిరీస్‌కు అడగలేదు.. నిర్మాతకు ఫుల్ కోఆపరేషన్ చేస్తా : నివేదా థామస్

లాక్డౌన్ సమయంలో కేవలం పుస్తకాలు చదువుతూ కాలం వెళ్లదీసినట్టు సినీ నటి నివేదా థామస్ చెప్పుకొచ్చారు. వెబ్ సిరీస్‌లలో నటించేందుకు తనను ఎవరూ సంప్రదించలేదని, ఒకవేళ సంప్రదిస్తే మాత్రం ఖచ్చితంగా నటిస్తానని తెలిపారు. 
 
కెరీర్‌ ఆరంభం నుంచి కథాంశాల ఎంపికలో నవ్యతకు పెద్దపీట వేస్తోందీ మలయాళీ సుందరి. నాని, సుధీర్‌బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘వి’ చిత్రంలో నివేదా థామస్‌ ఓ కథానాయికగా నటించింది. దిల్‌రాజు నిర్మాత. సెప్టెంబర్‌ 5న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలకానుంది. ఈ సందర్భంగా నివేదా థామస్‌ పాత్రికేయులతో ముచ్చటించింది.
 
‘వి’ అంటే విక్టరీ అనుకోవచ్చు. టైటిల్‌ వెనకున్న రహస్యమేమిటన్నది నేను చెప్పను. సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఇందులో నేను అపూర్వ అనే క్రైమ్‌ నవలా రచయిత్రి పాత్రలో కనిపిస్తాను. నిజాయితీ, ఆత్మవిశ్వాసానికి పెట్టింది పేరుగా నా పాత్ర చిత్రణ ఉంటుంది. 
 
పెద్దస్టార్స్‌ కలయికలో ఓటీటీ వేదికపై వస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే ఆంటున్నారు. నా వద్దకు వచ్చిన ప్రతి స్క్రిప్ట్‌ను వింటాను. అయితే పాత్రకు న్యాయం చేయగలనో లేదో అని విశ్లేషించుకొని నిర్ణయం తీసుకుంటా. స్టార్‌డమ్‌ గురించి ఏమాత్రం ఆలోచించను. ప్రతిభావంతురాలైన నటిగా గుర్తుండిపోవాలని కోరుకుంటానని చెప్పారు.
 
ఇకపోతే,లాక్డౌన్ సమయంలో పుస్తకాలు బాగా చదివాను. నా సినిమాల స్క్రిప్ట్స్‌ తాలూకు అంశాల్ని చర్చించాను. తెలుగు సినిమాకు సంబంధించి మూడు స్క్రిప్ట్స్‌ విన్నాను. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తా. వెబ్‌సిరీస్‌లలో నటించమని నన్నెవరూ అడగలేదని చెప్పారు. ఒకవేళ ఎవరైనా సంప్రదించినా, ఆఫర్స్ వచ్చినా ఆలోచిస్తా. సినిమాకు సంబంధించిన ఆర్థికాంశాల్ని అంతగా పట్టించుకోను. పారితోషికం విషయంలో నేనే నిర్మాతకు మద్దతుగా ఉంటాను.