బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (17:04 IST)

సాయి పల్లవి కలలోకి వస్తుండేది - విరాటపర్వం దర్శకుడు వేణు ఊడుగుల

Venu Udugula,
Venu Udugula,
రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం 'విరాట‌ప‌ర్వం'. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంపై ఇటీవల విడుదలైన ట్రైలర్ మరింత అంచనాలని పెంచింది.  జూన్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న విరాటపర్వం విశేషాలివి.
 
మీ రెండో సినిమాగా ఇంత బరువైన కథ చేయడానికి కారణం ?
నేను పుట్టి పెరిగిన వాతావరణం. చూసిన జీవితం. చదివిన పుస్తకాలు,..  నేను ఎలాంటి సినిమా తీయాలో అనే ఒక విజన్ ని ఇచ్చాయి. నాకు తెలిసిన జీవితాన్ని చెప్పాలని, చరిత్రలో దాగిన కథలు చెప్పాలనే ప్రయత్నంలో బాగంగా తీసిన సినిమానే విరాటపర్వం. బరువైన కథ చెప్పాలని గానీ క్లిష్టమైన కథ చెప్పాలని గానీ అనుకోను. నా టెంపర్మెంటే నా సినిమా. ఈ కథ చెప్పాలని అనుకున్నాను చెప్పాను తప్పితే ఇది బరువైనదా క్లిష్టమైనదా? అనే ఆలోచన లేదు.
 
లెఫ్ట్ నేపధ్యం ఏమైనా ఉందా ?
ఒక రాజకీయ, సంక్లిష్టమైన వాతారవణంలో పెరిగా. తెలంగాణ ఒక రాజకీయ ప్రయోగశాల. ఇక్కడ జరిగిన పరిణామాలు దేశ రాజకీయాలని ప్రభావితం చేసిన వాతావరణం. ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరగడం వలన సహజంగానే కొంత ప్రోగ్రసీవ్ ఐడియాలజీ వుంటుంది. అంతేకానీ లెఫ్ట్ , రైట్ అని కాదు.
 
'విరాట‌ప‌ర్వం, వెన్నెల పాత్రలకు ప్రేరణ ఉందా ?
వుంది. యదార్ధ సంఘటనలు ఆధారంగానే ఈ చిత్రాన్ని తీశాం. సరళ అనే ఒక అమ్మాయి జీవితం.
 
లెఫ్ట్ ప్రభావం బాగా తగ్గిపోయింది. వాళ్ళ ఐడియాలజీ గురించి ఒక జనరేషన్ కి సరిగ్గా అవగాహన కూడా లేదు కదా.. ఇలాంటి సందర్భంలో ఈ కథని అందరికీ కనెక్ట్ అయ్యేలా ఎలా చెప్పగలని అనుకున్నారు ?
లెఫ్ట్, రైటు అనేది అప్రస్తుతం. నేపధ్యాన్ని పక్కన పెడితే.. కథలో వున్న ప్రధాన భావోద్వేగం ఏమిటనేది ముఖ్యం. ఒక దొంగల కుటుంబం వుంది. ఆ కుటుంబంలో ఒక ప్రేమకథ చెబితే తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నేపధ్యానికి సంబంధం లేదు. విరాటపర్వంలో ఒక అందమైన ప్రేమకథ చెబుతున్నాం. 1990లోని రాజకీయ సందర్భాన్ని ఒక వ్యక్తిగతమైన సంఘర్షణగా చూపిస్తున్నాం. ఇది అందరికీ గొప్ప అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతున్నాను. మానవ సంబంధాల నేపధ్యంలో చెప్పే కథలని ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరిస్తారు. విరాటపర్వం ఒక అమ్మాయి ప్రేమకథ. నక్సల్ నేపధ్యంలో వస్తున్న తొలి ప్రేమకథ ఇది. చాలా కొత్తగా ఉండబోతుంది.
 
విరాటపర్వం విడుదలలో ఆలస్యం జరిగిందికదా. ఈ సమయంలో మీ మానసిక స్థితి ఎలా వుండేది ?
గ్రేట్ స్టార్ కాస్ట్, మంచి నిర్మాతలు వలన విరాటపర్వం సినిమా మొదలైనప్పటి నుండి సినిమాపై చాలా పాజిటివ్ బజ్ వుంది. ఇక కరోనా సమయంలో అందరిదీ ఒకటే పరిస్థితి. ఈ సమయంలో రెండు కథలు రాసుకున్నా. ఐతే సినిమా త్వరగా వస్తే బావుంటుదని అనిపించేది. అన్నీ అధికగమించి చాలా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.
 
సినిమాకి ఓటీటీ ఆఫర్లు వచ్చాయని విన్నాం ?
కొన్ని ఆఫర్లు వచ్చాయి. ఐతే మా నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ గారు సినిమాని బలంగా నమ్మారు. ఇది భారీగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాల్సిన సినిమా.
 
ప్రేమకి నక్సలిజంకి ఎలా ముడిపెట్టారు ?
విప్లవం అనేది ప్రేమైక చర్య. ఈ మాటని విసృతతంగా అర్ధం చేసుకోవాలి. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వుండేదే కాదు.. ఒక సమూహానికి వ్యక్తి మధ్య వుండే ప్రేమ. ఎంత ప్రేమ వుంటే ఒక సమూహంలోకి వెళ్లాలని అనుకుంటారు ?జనం కోసం పని చేయాలంటే ఎంతో ప్రేమ వుంటే తప్ప త్యాగం చేయలేం.
 
ఇది వెన్నెల కథ అని చెబుతున్నారు కదా.. మరి రానా లాంటి హీరోని ఈ కథ కోసం ఎలా ఒప్పించారు ?
రానా గారు ఈ కథ ఒప్పుకోవడం నా గొప్పదనం కాదు రానాగారి గొప్పదనం. నేను సురేష్ బాబు గారికి ఈ కథ చెప్పాను. సురేష్ బాబు గారు 'రానాకి లైన్ నచ్చింది చెప్తావా' అన్నారు. రానా గారికి చెప్పాను. కథ విన్న తర్వాత రానా గారు చేస్తా అన్నారు. ఈ కథ రానా గారు ఎందుకు చేస్తానన్నారో కాసేపు అర్ధం కాలేదు. ఒక కొత్త దర్శకుడు వైవిధ్యమైన కథతో వచ్చాడు. ఇలాంటి సినిమా మనం చేయకపోతే ఎవరు చేస్తారనే గొప్ప మనసుతో రానా గారు ఈ సినిమాని చేశారు.
 
రానాగారి గురించి కథలో మార్పులు చేశారా ?
లేదండీ. రానా గారు కూడా నా కోసం మార్పులు చేయండని అడిగే హీరో కాదు.
 
సురేష్ బాబు గారు ఎక్కువ చర్చలు, మార్పులు చేస్తారు కదా?
చర్చలు మంచిదే. అలాగే అవసరమైన మార్పులు కూడా జరగాలి. ఓటీటీ వచ్చిన తర్వాత ప్రేక్షకులు డిఫరెంట్ కంటెంట్ చూస్తున్నారు. ప్రేక్షకుల్లో ఫిల్మ్ లిటరసీ బాగా పెరిగింది. ఒక ఆర్ట్ సినిమా తీసి కమర్షియల్ సినిమా అంటే నమ్మే పరిస్థితి లేదు. జనాలకు మంచి కంటెంట్ ఇవ్వాలంటే చాలా చర్చలు, మార్పులు జరగడం తప్పులేదు. నా వరకైతే ఈ చర్చలు వలన మంచే జరిగింది.
 
ఈ కథని ఎవరిని ద్రుష్టిలో పెట్టి రాసుకున్నారు ?
ట్రైలర్ సాయి పల్లవి బ్యాగ్ పట్టుకొని జమ్మిగుంట అనే బోర్డ్ కనిపిస్తున్న ఊరు నుండి నడుస్తూ వస్తుంది. జమ్మిగుంట మా పక్క వూరు. నేను కథ రాస్తున్నపుడు అదే ఇమేజ్‌లో సాయి పల్లవి కలలోకి వస్తుండేది. అప్పటివరకూ సాయి పల్లవిని నేను కలిసింది లేదు. కానీ సాయి పల్లవి ఆ పాత్రలో కనిపిస్తుండేది. ఐతే హీరో ఎవరనేది మొదట అనుకోలేదు.
 
కథ వినగానే సాయి పల్లవి గారి రియాక్షన్ ఏంటి ?
సాయి పల్లవి గారికి పది నిమిషాలు కథ చెప్పాను. పది నిమిషాల తర్వాత ఓకే చేశారు. సాయి పల్లవే కాదు సురేష్ బాబు గారు మిగతా అందరూ సింగల్ సిట్టింగ్ లోనే కథని ఓకే చేశారు. ఈ కథలోనే అంత గొప్ప వైబ్రేషన్ వుంది.
 
90లో చిత్రీకరించారు కదా.. షూటింగ్ లో ఎదురైన సవాళ్లు ఏంటి ?
విరాటపర్వం షూటింగ్ ఒక సవాలే.  సినిమాని సహజంగా తీయాలని రిమోట్ ఏరియాల్లో షాట్ ప్లాన్ చేశాం. కానీ ఎక్కడికి వెళ్ళిన సెల్ టవర్స్, సెల్ ఫోన్ కామన్ గా కనిపించేది. గ్రాఫిక్స్ లో కూడా చాలా ఎఫర్ట్ పెట్టాం. మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఒక రెండు సినిమాలు పడాల్సిన కష్టం ఈ సినిమా కోసం పడ్డారు. ఈ క్రెడిట్ అంతా మా నిర్మాతలకే దక్కుతుంది.
 
ఈ సినిమా కోసం నక్సలిజం, నక్సల్ బాడీ లాంగ్వేజ్ పై మీరు చేసిన రీసెర్చ్ ఏమిటి ?
చదువుకోవడం, పది మందిని కలవడం. చిన్నపుడు మా వూర్లో కొంత చూడటం వలన ఈజీ అయ్యింది.
 
విరాటపర్వంలో అన్ని వాస్తవాలు వుంటాయా ?
1992లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వెనుక రాజకీయ కారణాలు వుండటం వలన ఈ కథని జనాలకి చెప్పాలని ప్రేరణ పొందా. ఐతే సినిమా అన్నప్పుడు కొంత ఫిక్సన్ వుంటుంది. కథని సినిమాగా మార్చుకున్నపుడు కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమానే తప్ప ఇది బయోపిక్ కాదు.
 
ఈ సినిమా ముగింపు ఎలా వుంటుంది ?
ఈ సినిమా ముగింపు ఏమిటనేది ఇప్పుడే చెప్పను. అయితే ఆ ముగింపు ప్రేక్షకుడిపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
 
ఈ చిత్రం కోసం నందిత దాస్, జారినా వహాబ్ లాంటి పెద్ద స్టార్ కాస్ట్ తీసుకొచ్చారు కదా, ఇది ఎవరి ఛాయిస్ ?
ఛాయిస్ నాదే. అయితే అంత పెద్ద స్టార్ కాస్ట్ రావడానికి కారణం మాత్రం మా నిర్మాతలే. నిర్మాతల సహకారం వలనే అంత పెద్ద స్టార్ కాస్ట్ తీసుకొచ్చి సినిమాని ఇంత గొప్పగా చేయగలిగాను. సినిమాని అద్భుతంగా తీశాననే నమ్మకంగా ఉన్నానంటే కారణం నిర్మాతలే. నిర్మాతలే నా బలం.
 
విరాటపర్వం టైటిల్ ఆలోచన ఎలా వుంది ?
మహా భారతంలో విరాటపర్వం అనేది అండర్ గ్రౌండ్ స్టొరీ. అందులో వున్న కుట్రలు రాజకీయాలు ఫిలాసఫీ ఈ చిత్రానికి సరిపోతుందని ఆ టైటిల్ పెట్టాం.
 
కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్ రావడం కాస్త తగ్గించారు కదా.. విరాటపర్వం ప్రేక్షకులని థియేటర్ లోకి తీసుకొస్తుందని భావిస్తున్నారా ?
విరాటపర్వం ట్రైలర్ కి 7.5 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక నిజాయితీ గల కథ చెబుతున్నాం. ఇది గొప్ప ప్రేమ కథ. ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. విక్రమ్, మేజర్ సినిమాలతో వాతావరణం సెటిల్ డౌన్ అయ్యింది. విరాటపర్వంకి ఇది మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నా.
 
భవిష్యత్ లో ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు.. లాక్ డౌన్ లో రాసుకున్న కథలు ఎలా వుంటాయి ?
అర్ధవంతమైన సినిమాలు చేయాలనేది నా తపన. అలోచించ చేయాలనే చెప్పాలని వుంటుంది. అలాంటి కథలే రాశాను.
 
రానా గారు వుండగా ఇది సాయి పల్లవి సినిమా అని ప్రాజెక్ట్ చేయడానికి కారణం ఏమిటి ?
ఇది సాయి పల్లవి సినిమా కాబట్టే. ఇది వెన్నెల అనే అమ్మాయి కథ. రానా గారు ఈ చిత్రానికి నిర్మాత కూడా. ఆయన చాలా గొప్ప మనసుతో చాలా నిజాయితీ తో మనం తీసింది ప్రేక్షకుల వద్దకు అంతే నిజాయితీ గా తీసుకువెళితే ఆదరిస్తారని చెప్పారు.  అలాగని మొత్తం వెన్నెల పాత్రే వుండదు. చంద్రుడు లేకుండా వెన్నెల వుండదు కదా.. రానా గారి పాత్ర కూడా చాలా ముఖ్యం. 
 
మైదానం ప్రాజెక్ట్ ఎక్కడి వరకూ వచ్చింది ?
అది 'ఆహా' కి చేస్తున్నాం. ఇది చలం రాసిన నవలకి మనదైన వ్యాఖ్యానంతో వుంటుంది . దీనికి షో రన్నర్ గా చేస్తున్నా. కవిత్వం అప్పుడప్పుడు రాస్తుంటా. అయితే నా మెయిన్ ఎమోషన్ సినిమానే.