ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా
తన గురించి రాసేటపుడు ఏ.ఆర్.రెహ్మాన్ మాజీ అని రాయొద్దని మీడియాకు సైరా బాను విజ్ఞప్తి చేశారు. తాము ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోలేదని ఆమె గుర్తుచేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని, అందుకే ఆయనకు దూరంగా ఉంటున్నాననీ వెల్లడించారు. అంతేకానీ, విడాకులు తీసుకోలేదని మరోసారి స్పష్టంచేశారు.
కాగా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఆదివారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఆ తర్వాత మధ్యాహ్నానికి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు.
ఛాతీనొప్పి కారణంగానే రెహ్మాన్ ఆస్పత్రిలో చేరినట్టు ఆదివారం ఉదయం కథనాలు వచ్చాయి. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. డీహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా ఆయన అస్వస్థతకు గురయ్యారని, ఈ మేరకు చికిత్స తీసుకున్నారని ఆయన సోదరి తెలిపారు. ఇదే విషయాన్ని వైద్యులు కూడా ధృవీకరించారు. చికిత్స అనంతరం ఆయన్ని డిశ్చార్జ్ చేసినట్టు వెల్లడించారు.