1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: ఆదివారం, 4 అక్టోబరు 2015 (19:04 IST)

నడిగర్ సంఘం ఎన్నికలు... కమల్ కృతఘ్నుడు... తిట్టిపోసిన శరత్ కుమార్

టాలీవుడ్ "మా" ఎన్నికల సమయంలో ఎంత రచ్చ జరిగిందో తెలియనివారు ఎవరూ లేరు. కానీ ఎన్నికలు ముగిశాక, ఫలితాలు వచ్చాక రాజేంద్రప్రసాద్ మా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టాక, అంతకుముందు దుమ్మెత్తిపోసిన నటులను సైతం మళ్లీ ఆహ్వానించి వారిని భాగస్వాములను చేశాడు రాజేంద్రుడు. ఐతే, ఎన్నికల సమయంలో మామూలుగా రచ్చ జరగలేదు. ఇప్పుడు అలాంటిదే కోలీవుడ్ నడిగర్ సంఘం ఎన్నికల్లోనూ తలెత్తింది. 
 
నడిగర్ సంఘం ఎన్నికలు అక్టోబరు 18న జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో నటుడు విశాల్ వర్సెస్ శరత్ కుమార్ ప్యానెల్స్ నువ్వా నేనా అనే రీతిలో ఢీకొంటున్నాయి. ఈ రెండు ప్యానెళ్లకు చెందిన నటులు ఇప్పటికే ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఆదివారంనాడు అది తారాస్థాయికి వెళ్లింది. రాధిక భర్త, నటుడు శరత్ కుమార్ సకలకళా వల్లభుడు అయిన కమలహాసన్ పైన మండిపడ్డారు. కమల్ కృతజ్ఞత లేని వారనీ, చేసిన మేలు మరచిన కృతఘ్నుడంటూ విమర్శించారు.
 
కమల్ హాసన్ నటించిన విశ్వరూపం చిత్రం విడుదల సమయంలో ఇబ్బందులు పడ్డప్పుడు తాను సాయం చేశాననీ, అలాగే ఉత్తమ విలన్ విడుదల సమయంలోనూ తన భార్య రాధికా సాయం చేసినా నడిగర్‌ సంఘం ఎలాంటి సాయం చేయలేదని కమల్ అనడం కృతఘ్నుత కాక ఇంకేమిటి అంటూ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కమలహాసన్ పోటీ జట్టుకు పరోక్షంగా మద్దతు పలుకుతున్నారని శరత్‌కుమార్ ఆరోపించారు.
 
కాగా విశాల్, శరత్ కుమార్ ప్యానెళ్లు తమతమ మ్యానిఫెస్టోలను విడుదల చేయగా విశాల్ జట్టుకు గెలిచే అవకాశం ఉన్నట్లు ఓ ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ సర్వేలో తేలింది. విశాల్ జట్టు 64 శాతం, శరత్ కుమార్ జట్టు 26 శాతం ఓట్లు పడతాయని ఆ సర్వేలో తేలింది.