1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 మే 2024 (18:20 IST)

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

ys jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 13వ జరిగే ఎన్నికల పోలింగ్ కురుక్షేత్ర యుద్ధంతో సమానమని, ఇవి మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అని ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తన ఎననికల ప్రచారంలో భాగంగా, గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావని, ప్రజల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేస్తే సంక్షేమ పథకాల కొనసాగింపునకు ఓటు వేసినట్లేనని జగన్ తెలిపారు. అదే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాల ముగింపునకు ఓటు వేసినట్లేనని, నిద్రపోయిన చంద్రముఖిని మళ్లీ లేపి ఇంటికి తెచ్చుకున్నట్లు అవుతుందని జగన్ వివరించారు. 
 
ఈ ఐదేళ్ల కాలంలో 2 లక్షల 70 వేల కోట్ల రూపాయల్ని సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు నేరుగా అందించామని జగన్ చెప్పారు. రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలను కల్పించామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా వైద్య నియామకాలు చేపట్టామని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో రంగురంగుల కాగితాల్లో మేనిఫెస్టోలు ప్రకటించి ఎన్నికలయ్యాక వాటిని చెత్తబుట్టలోకి విసిరేస్తారని ప్రతిపక్షాలను విమర్శించారు.
 
వైసీపీ మేనిఫెస్టో ప్రకటించాక దానిని ఓ భగవద్గీతలాగా, ఖురాన్‌లా, బైబిల్‌గా భావించి అందులో హామీలను 99 శాతం అమలు చేశామని జగన్ చెప్పారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని అందంగా తీర్చిదిద్దామని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం, డిజిటల్ మీడియాలో బోధన విధానాన్ని కూడా తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ప్రతివిద్యార్థికి ట్యాబ్‌‍లు, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రూపొందించిన పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందజేశామని చెప్పారు. అందువల్ల రానున్న ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.