శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 మే 2024 (11:14 IST)

సింహపురికి ఎన్నోసార్లు వచ్చాను.. ఇంత ఘన స్వాగతం లభించలేదు : పవన్ కళ్యాణ్

pawan kalyan
గతంలో సింహపురి (నెల్లూరు) జిల్లాకు ఎన్నోసార్లు వచ్చానని, కానీ, ఎన్నడూ ఇంత ఘన స్వాగతం లభించలేదని సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం రాత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నారాయణతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ, నెల్లూరులో ఇంతటి ఘనస్వాగతం లభిస్తుందని ఊహించలేదని అన్నారు.
 
తాను ఇక్కడే దర్గామిట్టలోని సెయింట్ జోసెఫ్ స్కూల్, వీఆర్సీలో చదువుకున్నానని గుర్తుచేశారు. ఆ సమయంలో రెండు అంశాలు నేర్చుకున్నానని, పార్టీ పెట్టడంలో ఆ అంశాలు సహాయపడ్డాయని తెలిపారు. ఒకటి దేశభక్తి, రెండు తప్పు జరిగితే పుచ్చలపల్లి సుందరయ్యలా బయటికొచ్చి గొంతు విప్పి మాట్లాడడం అని వివరించారు. నెల్లూరులో ఫతేఖాన్ పేట, మూలపేట, సంతపేట, రంగనాయకులుపేటలో తిరిగానని వెల్లడించారు.
 
ఇక్కడ కూటమి అభ్యర్థులు నారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని జనసేన శ్రేణులకు పవన్ పిలుపునిచ్చారు. గూండా ప్రభుత్వానికి మనం భయపడాలా? ఆత్మగౌరవాన్ని తీసేసే వ్యక్తులకు మనం భయపడతామా? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మనం భయపడతామా? అంటూ కార్యకర్తల్లో కదనోత్సాహం నింపే ప్రయత్నం చేశారు.
 
సింహపురి ఇది... గుండె లోతుల్లోంచి అన్యాయానికి ఎదురుతిరిగే సింహపురి ఇది అని అభివర్ణించారు. బలంగా నిలబడదాం... మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తా... అవినీతి కోటలు బద్దలు కొడదాం అంటూ పిలుపునిచ్చారు.