బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 మే 2024 (16:20 IST)

మన ఆస్తి... మనదని 90 రోజుల్లో రుజువు చేసుకోవాలా? ఎంత దుర్మార్గం : పవన్ కళ్యాణ్

pawan kalyan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ 2024 తీవ్ర వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా, ఎన్నికల సమయంలో ఈ భూహక్కు చట్టం అమలు చేయడంతో విపక్షాలకు మంచి ప్రచార అస్త్రం లభించినట్టయింది. ఈ చట్టంలోని లోపాలను విపక్ష నేతలు ప్రజలకు పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పవన్‌ ప్రసంగించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం గళమెత్తిన పార్టీ జనసేన అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఠా కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు భయపడకుండా బతకాలన్నదే తన కోరికన్న పవన్‌.. సమస్యల పరిష్కార బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
 
'వైకాపా పాలనలో 112 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయి. 430 కేసులు నమోదు చేశారు. మీడియాను కట్టడి చేసేందుకు జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. అసెంబ్లీలో చర్చ జరగకుండానే, భూములు దోచేసే చట్టం తీసుకొచ్చారు. మన ఆస్తి.. మనదని రుజువు చేసుకోవాలా?90 రోజుల్లో రుజువు చేసుకోకపోతే దోచుకుంటారా? వంద గజాల భూమి ఉన్న వ్యక్తి కూడా న్యాయం కోసం హైకోర్టు తలుపు తట్టాలా?' అని పవన్‌ ప్రశ్నించారు. 
 
వైకాపా ప్రభుత్వం యువతను గంజాయి మత్తుకు బానిస చేసిందని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్‌కు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని, ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎంతో ఆలచన చేసి విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేసి విజయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.