గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (15:23 IST)

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మృతి

Senior Director Sarath
ప్రముఖ సీనియర్‌  దర్శకుడు శరత్  మృతి చెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం నాడు  తుదిశ్వాస విడిచారు. శ‌నివారం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంసభ్యులు తెలిపారు. 'డియర్‌' అనే నవల ఆధారంగా ‘చాద‌స్తపు మొగుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆయన తెలుగులో సుమారు 20 సినిమాలకు దర్శకత్వం వహించారు.

 
బాల‌కృష్ణతో పెద్దన్నయ్య, వంశానికొక్కడు వంటి సూప‌ర్ హిట్స్ తీశారు. సుమ‌న్‌తో బావ‌-బావ‌మ‌రిది, పెద్దింటి అల్లుడు, చిన్నల్లుడు వంటి విజ‌య‌వంత‌మైన సినిమాలు రూపొందించారు. మ‌హాన‌టుడు ఏఎన్నార్‌తో కాలేజీ బుల్లోడు, న‌ట‌శేఖ‌ర కృష్ణతో సూప‌ర్ మొగుడు లాంటి చిత్రాలు తీశారు. శ‌ర‌త్ మ‌ర‌ణవార్త ఆయ‌న‌తో ప‌నిచేసిన వారికి దిగ్భ్రాంతి క‌లిగించింది. ఆయ‌న మంచిత‌నాన్ని, ప‌నితీరును గుర్తు చేసుకుంటూ ప‌లువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
 
 
మంచి ద‌ర్శ‌కుడిని, ఆప్తుడిని  కోల్పోయాం- నంద‌మూరి బాల‌కృష్ణ
ప్రముఖ సీనియర్‌ దర్శకుడు శరత్ మృతిప‌ట్ల నంద‌మూరి బాల‌కృష్ణ తీవ్ర సంతాపాన్ని తెలియ‌జేశారు. ఆయ‌న నాకు మంచి ఆప్తుడు. ప‌రిశ్ర‌మ‌లో మంచి మ‌నిషిగా పేరుతెచ్చుకున్నారు. ఆయ‌న‌తో నేను `వంశాని కొక్క‌డు, పెద్ద‌న్న‌య్య‌, సుల్తాన్, వంశోద్ధార‌కుడు` సినిమాలు చేశాను. ఈరోజు ఆయ‌న మ‌ర‌ణ‌వార్త న‌న్ను బాధించింది. మంచి మ‌నిషి, నిస్వార్థుడు, ఆప్తుడిని కోల్పోయాం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని  కోరుకూంటూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియ‌జేస్తున్నాను.