ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (12:45 IST)

తండ్రి వారసులుగా విజయాన్ని అందుకోవాలి : కోడి రామ‌కృష్ణ కుమార్తెలు దివ్య దీప్తి, కోడి ప్రవళిక

Divya Deepti, Kodi Pravalika
Divya Deepti, Kodi Pravalika
టాలీవుడ్ చ‌రిత్ర‌లో గొప్ప గొప్ప చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కులు అరుదు. అలాంటి అరుదైన ద‌ర్శ‌కుల్లో కోడి రామ‌కృష్ణ ఒక‌రు. తెలుగు చిత్ర సీమ గురువుగారు అంటూ పిలుచుకునే ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు శిష్యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టారు కోడి రామ‌కృష్ణ‌. విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను రూపొందిస్తూ ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టుకు ఎక్కుతూ శ‌తాధిక ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకుని గురువుకి త‌గ్గ శిష్యుడిగా పేరు సంపాదించుకున్నారు. 
 
Kodi Ramakrishna, padma,  Divya Deepti, Pravalika
Kodi Ramakrishna, padma, Divya Deepti, Pravalika
ప్ర‌తాప్ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత కె.రాఘ‌వ నిర్మాత‌గా రూపొందించిన తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌యాణం ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి తొలి నాళ్ల‌లో హీరోగా న‌టించిన ఆ చిత్రం అప్ప‌ట్లో 560 రోజులకు పైగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అక్క‌డి నుంచి ఆయ‌న వెనుదిరిగి  చూసుకోలేదు. ఫ్యామిలీ డ్రామాలు, యాక్ష‌న్ చిత్రాలు, పొలిటిక‌ల్ సెటైర్స్‌, ఫిక్ష‌న్‌, ఫాంట‌సీ, థ్రిల్ల‌ర్ ఇలా జోన‌ర్ ఏదైనా స‌రే! ఆయన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు తీసి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. చిన్న సినిమాలు తీసి భారీ విజ‌యాల‌ను ద‌క్కించుకున్నారు. స్టార్ హీరోల‌తో బాక్సాఫీస్ రికార్డుల‌ను షేక్ చేయించారు. టాలీవుడ్‌లో మ‌రే ద‌ర్శ‌కుడికీ లేన‌న్ని సిల్వ‌ర్‌, గోల్డెన్ జూబ్లీ మూవీస్ చేసిన ఘ‌న‌త ఆయ‌న‌కే సొంతం. 
 
ఎ.ఎన్‌.ఆర్‌, కృష్ణ‌, కృష్ణంరాజు, చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్, నాగార్జున‌, రాజశేఖ‌ర్ వంటి హీరోల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ను తెర‌కెక్కించట‌మే కాకుండా ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ముద్ర‌ను వేయ‌టం కోడి రామ‌కృష్ణ‌కే చెల్లింది. హీరోయిజాన్నే కాదు, అకుంశం వంటి చిత్రంలో రామిరెడ్డి, భార‌త్ బంద్ చిత్రంలో కాస్ట్యూమ్ కృష్ణ వంటి న‌టీన‌టుల‌తో స‌రికొత్త విల‌నిజాన్ని తెలుగు సినీ తెర‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఈయన‌కే ద‌క్కుతుంది. ఇప్పుడు వి.ఎఫ్‌.ఎక్స్ సినిమాలు చేయ‌టం సాధార‌ణంగా మారాయి. కానీ అవేంటో తెలియ‌ని స‌మ‌యంలోనూ దేవి, దేవీపుత్రుడు, అంజి, అమ్మోరు, అరుంధ‌తి వంటి సినిమాల‌తో ఔరా! అని ఆశ్చ‌ర్య‌పోయేలా గ్రాఫిక్స్‌ను క్రియేట్ చేశారు. 
 
నిర్మాత‌ల మంచి కోరే ద‌ర్శ‌కుల్లో ముందుంటారాయ‌న‌. తోటి నటీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు అండ‌గా నిలవ‌టంలో కోడిరామ‌కృష్ణ తర్వాతే ఎవ‌రైనా అనే పేరుని సంపాదించుకున్నారు. ద‌ర్శ‌కుడిగానే కాదు, న‌టుడిగానూ కొన్ని చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించి ప్రేక్ష‌కుల మెప్పుని పొందారు. దాదాపు 120 చిత్రాల‌కు పైగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించి, ఈ సుదీర్ఘ ప్ర‌యాణంలో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానాన్ని సంపాదించుకున్న శ‌తాధిక ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ జ‌యంతి జూలై 23. ఈ సంద‌ర్భంగా ఆయన‌కు ముర‌ళీ మోహ‌న్‌, బాబూ మోహ‌న్‌, శివాజీ రాజా, పృథ్వీ, హీరో శ్రీకాంత్, జొన్న‌విత్తుల‌, రేలంగి న‌ర‌సింహారావు, దేవీ ప్ర‌సాద్‌, డైరెక్ట‌ర్ రాంబాబు స‌హా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు నివాళులు అర్పించి కోడి రామ‌కృష్ణ‌తో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. 
 
ఇప్పుడు తండ్రికి త‌గ్గ త‌న‌య‌గా కోడి రామ‌కృష్ణ కూతుళ్లు కోడి దివ్య దీప్తి, కోడి ప్రవళిక నిర్మాతలుగా ప్రయాణాన్ని ప్రారంభించారు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ విజయాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిద్దరూ మరిన్ని ప్రాజెక్టులు చేసేందుకు సంకల్పించారు.