గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : ఆదివారం, 21 మే 2023 (20:41 IST)

సాయి ధరమ్ తేజ్ మెచ్చిన సిద్ధార్థ్ 'టక్కర్' ట్రైలర్

Siddharth, Divyansha Kaushik
Siddharth, Divyansha Kaushik
హీరో సిద్ధార్థ్ 'టక్కర్' అనే సినిమాతో సరికొత్తగా అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.
 
తాజాగా చిత్ర బృందం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది. రొమాన్స్, కామెడీ, యాక్షన్ సంగమంగా రూపొందిన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.
 
ఈరోజు(మే 21) సాయంత్రం 5 గంటలకు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా 'టక్కర్' ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న టక్కర్ సినిమా ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ఈ ట్రైలర్ ఉత్కంఠభరితంగా, వినోదాత్మకంగా ఉందని కొనియాడారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
 
విడుదలైన 'టక్కర్' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. "ఆశే ఈ లోకాన్ని నడిపిస్తుంది. అదే ఆశ మన లైఫ్ ని నిర్ణయిస్తుంది. ఆ ఆశని నెరవేర్చుకోడానికి ధనమే ఇంధనం. దానిని సంపాదించుకోడానికి ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఆ దారి అందరికీ ఒకటైనప్పుడు" అంటూ సిద్ధార్థ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న సాధారణ యువకుడిగా కథానాయకుడు కనిపిస్తుండగా, బాగా డబ్బున్న యువతిగా కథానాయిక కనిపిస్తోంది. వారి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మెప్పిస్తున్నాయి. తనని ఎంతగానో నమ్మిన కథానాయికని డబ్బు కోసం కిడ్నాప్ చేయాల్సిన పరిస్థితి కథానాయకుడికి ఎందుకు వచ్చింది? వారిని ప్రతినాయకులు ఎందుకు వెంటాడుతున్నారు? కథానాయిక ఆత్మహత్యాయత్నానికి కారణం కథానాయకుడేనా? అనే ప్రశ్నలతో ఉత్కంఠను రేకెత్తిస్తూ ట్రైలర్ ఆద్యంత ఆసక్తికరంగా సాగింది. ఇక ట్రైలర్ లో యోగిబాబు హాస్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే "డబ్బు సంపాదిస్తానని చెప్పు.. కానీ డబ్బున్నోడిని అవుతానని అనకురా.. నాకు భయంగా ఉంది", "నా దగ్గర డబ్బుల్లేవు.. నీకు ఇడ్లీలు కొనివ్వాలంటే, నా కిడ్నీలు అమ్ముకోవాలి", "నూడుల్స్ తినే నీకే ఇంతుంటే.. చేపల పులుసు తినే నాకెంత ఉంటుందిరా" వంటి సంభాషణలు అలరిస్తున్నాయి. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే.. ఖర్చు విషయంలో వెనకాడకుండా భారీ స్థాయిలో నిర్మించారని అర్థమవుతోంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అభిప్రాయం కలుగుతోంది. 
 
ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలతో 'టక్కర్'పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా సిద్ధార్థ్ సినిమాలలో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలతో పాటు ఉత్కంఠను రేపేలా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయి. ఇప్పటికే విడుదలైన 'టక్కర్' టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన 'కయ్యాలే', 'పెదవులు వీడి మౌనం' పాటలు కూడా విశేష ఆదరణ పొందాయి. 
 
ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధించి, సిద్ధార్థ్ కెరీర్ లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది. ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె, ఎడిటర్ గా జీఏ గౌతమ్ వ్యవహరిస్తున్నారు.