సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 28 మే 2024 (19:00 IST)

జీ5లో SIT చిత్రం టాప్ 5లో ట్రెండ్ అవడం ఆనందంగా ఉంది : డైరెక్టర్ విజయ భాస్కర్ రెడ్డి

Director Vijaya Bhaskar Reddy
Director Vijaya Bhaskar Reddy
అరవింద్ కృష్ణ, నటాషా దోషి హీరో హీరోయిన్లుగా విజయ భాస్కర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం S.I.T (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం). ఈ చిత్రాన్ని నాగి రెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ మే 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఆడియెన్స్‌ని ఓటీటీలో బాగానే ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి మంచి ఆదరణ వస్తుండటంతో దర్శకుడు విజయ భాస్కర్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆయన తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.

ఆయన మాట్లాడుతూ.. ‘కడప జిల్లాలోనే పుట్టి పెరిగాను. అక్కడే విద్యాభ్యాసం జరిగింది. మాది ఉమ్మడి కుటుంబం. అందరం కలిసి ఒకే చోట ఉండేవాళ్లం. రైతుల కష్టం నాకు తెలుసు. మా నాన్న పడ్డ కష్టాలు మేం పడకూడదని మా అందరినీ ఉన్నత చదువులు చదివించారు. నా డిగ్రీ తరువాత హైద్రాబాద్‌కు వచ్చాను. ఆ టైంలోనే నేను ఐసెట్, డీఎఫ్ టెక్ కోర్సులకు కోచింగ్ తీసుకున్నాను. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంపీఏ చేశాను. ఆ తరువాత ఇండస్ట్రీలోకి వచ్చాను. అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా వివిద దర్శకుల వద్ద పని చేశాను.
 
SIT మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాను. సినిమాల్లోకి రావడం నా ఫ్యామిలీకి ఇష్టం లేదు. కానీ మా పెద్దన్న నాకు అండగా నిలబడ్డాడు. ఆయన వల్లే ఇండస్ట్రీలో ఉండగలిగాను. పదిహేనేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. నా డిగ్రీ ఫ్రెండ్స్ ఫండింగ్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ కథను వెబ్ సిరీస్ కంటే సినిమా తీస్తేనే బాగుంటుందని అన్నారు. నాగి రెడ్డి, బాల్ రెడ్డి నన్ను ముందు నుంచీ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఓ ఫ్రెండ్ ద్వారా నిర్మాత తేజ గారిని వైజాగ్‌లో కలిశాం. శ్రీనివాస్, రమేష్ గారు ఇలా అందరూ కలిసి ఈ మూవీని ఇక్కడి వరకు తీసుకొచ్చారు.
 
ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ అద్భుతంగా నటించారు. ఆయన సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. నటాషా గారు చక్కగా నటించారు. నటీనటులు, టెక్నీషియన్ల సహకారంతోనే ఈ మూవీని ఇంత బాగా తీయగలిగాను.
 
ఇది ఓటీటీ కంటెంట్ కాబట్టి.. ముందు నుంచి కూడా మేం ఓటీటీ కోసమే ప్రయత్నాలు చేశాం. చివరకు మా సినిమా ఓటీటీలోకి వచ్చిది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండో పార్ట్ ఎప్పుడు, మూడో పార్ట్ ఎప్పుడు? అని అంతా అడుగుతున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రీచ్ అయిందని తెలుస్తోంది. జీ5లో ప్రస్తుతం మా చిత్రం టాప్ 5లో ట్రెండ్ అవుతోంది. చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.