మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (20:55 IST)

అసురన్, సురరై పోట్రు ఖాతాలో అరుదైన రికార్డ్.. ఏంటది?

తమిళ ఇండస్ట్రీ నుంచి విడుదలైన అసురన్, సురరై పోట్రు సినిమాలు అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఈ రెండింటికీ ప్రేక్షకులు నీరాజనం పలికారు. సమాజంలో వేళ్లూనుకున్న కులాన్ని దానిమాటున కొనసాగుతున్న నిరంకుశత్వాన్ని 'అసురన్' నిలదీస్తే.. విమాన ప్రయాణాన్ని డబ్బున్న వాడికే పరిమితం చేయడం వెనుక కుట్రల్ని ప్రశ్నించింది 'సూరారై పొట్రు'. ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాలు.. మరో అరుదైన ఘనతనూ సొంతం చేసుకున్నాయి.
 
ఈ రెండు సినిమాలను 78వ 'గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్' వేడుకల్లో ప్రదర్శించనున్నారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జనవరిలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో ఈ రెండు తమిళ సినిమాలు ఎంపికయ్యాయి.
 
అసురన్ మూవీ 2019లో విడుదలై సంచలనం సృష్టించింది. ఈ మూవీని వెట్రి మారన్ అద్భుతంగా తెరకెక్కించాడు. ధనుష్ తన పాత్రకు ప్రాణం పోశాడనే చెప్పాలి. ఈ సినిమా ధనుష్ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ 'నారప్ప' పేరుతో రీమేక్ చేస్తున్నారు.
 
ఇక సూర్య చేసిన 'సూరారై పొట్రు' చిత్రం ఇటీవలే ఓటీటీలో రిలీజైంది. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడంతో 'అమెజాన్ ప్రైమ్' ద్వారా విడుదలైన ఈ సినిమా.. అన్ని వర్గాలనుంచీ విశేష ఆదరణ పొందింది. సింగిల్ లైన్ కంటెంట్‌తో సుధా కొంగర ఈ చిత్రాన్ని గొప్పగా చిత్రీకరించారు. తెలుగులోనూ 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదలైన ఈ సినిమా.. ఇక్కడి ప్రేక్షకుల్ని కూడా బాగా ఆకట్టుకుంది.