సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2020 (15:39 IST)

నా తండ్రి వైద్య ఖర్చులు వెల్లడిస్తా.. దుష్ప్రచారం చేయొద్దు.. ప్లీజ్ : ఎస్పీబీ చరణ్

తన తండ్రి వైద్యం కోసం అయిన ఖర్చుల వివరాలు, ఆస్పత్రికి చెల్లించిన బిల్లుల పూర్తి వివరాలను వెల్లడిస్తానని గానగంధర్వుడు దివంగత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్.పి.బి. చరణ్ ప్రకటించారు. అంతేకానీ ఈ బిల్లులు ఎవరో చెల్లించారనీ, డబ్బుల కోసమే ఆస్పత్రి యాజమాన్యం అంతకాలం చికిత్స చేసిందంటూ దుష్ప్రచారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
తన అమృతగానంతో సినీ సంగీత ప్రేమికులను దశాబ్దాల పాటు అలరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అత్యంత విషాదకర రీతిలో కన్నుమూశారు. కరోనా రక్కసి బారినపడిన ఆయన దాదాపు 50 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే, ఇన్నిరోజుల పాటు ఎస్పీ బాలుకు చికిత్స అందించింది డబ్బు కోసమేనంటూ సోషల్ మీడియాలో చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలపై తీవ్రస్థాయిలో విమర్శలు మొదలయ్యాయి.
 
ఈ ప్రచారంపై ఎస్పీ బాలు తనయుడు ఎస్పీబీ చరణ్ స్పందించారు. ఇలాంటి పుకార్లు కట్టిపెట్టాలని హితవు పలికారు. త్వరలోనే తన తండ్రి వైద్య చికిత్సకైన ఖర్చులు, ఆసుపత్రి బిల్లులను వెల్లడిస్తానని, ఎవరికైనా సందేహాలుంటే తొలగిపోతాయన్నారు. తన తండ్రి ఆసుపత్రి బిల్లుల వ్యవహారాన్ని సెటిల్ చేసేందుకు ఢిల్లీ పెద్దలు కలుగజేసుకోవాల్సి వచ్చిందన్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని కొట్టిపారేశారు.
 
'మేం కొంతమేరకే బిల్లు చెల్లిస్తే, మిగతా బ్యాలన్స్ చెల్లిస్తేనే తన తండ్రి భౌతికకాయాన్ని అప్పగిస్తామని హాస్పిటల్ కరాఖండీగా చెప్పిందనడం, ఆపై తాను తమిళనాడు ప్రభుత్వాన్ని సంప్రదించగా, వారు స్పందించకపోతే భారత ఉపరాష్ట్రపతిని సాయం కోరగా, ఆయన జోక్యంతో పరిస్థితి సద్దుమణిగిందనడం.. ఇదంతా వట్టిదే' అని చరణ్ స్పష్టం చేశారు.