మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (15:34 IST)

#RIPSridevi : వెండితెర దేవకన్య... మళ్లీ ఎప్పుడు పుడతావ్..

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరి మనస్సుల్లో తన నటనతో చిరస్థాయిగా నిలిచిన నటి శ్రీదేవి. నీవులేని వెండి తెర మూగబోయింది.. లైట్స్, కెమెరా నిశ్సబ్ధంగా ఉన్నాయి. ఇలాంటి నటిని మళ్లీ చూస్తామా అంటూ

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరి మనస్సుల్లో తన నటనతో చిరస్థాయిగా నిలిచిన నటి శ్రీదేవి. నీవులేని వెండి తెర మూగబోయింది.. లైట్స్, కెమెరా నిశ్సబ్ధంగా ఉన్నాయి. ఇలాంటి నటిని మళ్లీ చూస్తామా అంటూ శోకసంద్రంలో మునిగిపోయాయి చిత్ర పరిశ్రమలు. భువి నుంచి దివికి వెళ్లిన నీవ్వు.. మళ్లీ భువికి రాకపోతావా అంటూ శ్రీదేవి జ్ణాపకాలను నెమరవేసుకుంటున్నారు.
 
దీనికి కారణం శ్రీదేవి ఓ వెండితెర దేవకన్య. దివి నుంచి భువికి దిగివచ్చిన ఓ అతిలోకసుందరి. నాలుగేళ్ల  ప్రాయంలోనే తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చిన బాలనటి. 1969లో 'తునైవన్' సినిమాతో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలనటిగానే పలు చిత్రాల్లో మురుగన్‌ (సుబ్రహ్మణ్య స్వామి)గా, కృష్ణుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ బాలనటిగా ఎంట్రీ ఇచ్చారు. 
 
దర్శక దిగ్గజం భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన "పదునారు వయదినిలే" సినిమాతో ఆమెకు హీరోయిన్‌గా మంచి గుర్తిం‍పు వచ్చింది. ఈ సినిమా రీమేక్‌గానే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెలుగులో "పదహారేళ్ల వయసు" సినిమాతో అభిమానుల గుండెల్లో సుస్ధిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ సినిమా షూటింగ్ అప్పుడు శ్రీదేవి వయస్సు 14 ఏళ్లే కావడం విశేషం..
 
16 ఏళ్ళ వయసు సినిమాతో ఆమెకు తెలుగులో వరుసగా ఆఫర్లు వరించాయి. ఈ అందాలతారను స్టార్  హీరోయిన్‌గా మార్చిన మూవీ "వేటగాడు". హీరో సీనియర్ ఎన్టీఆర్. 'బడిపంతులు' సినిమాలో ఎన్టీఆర్ మనవరాలిగా నటించిన శ్రీదేవి తర్వాత ఏడేళ్లకు ఆయన సరసనే హీరోయిన్‌గా నటించి మెప్పించారు. 'వేటగాడు'తో మంచి విజయం అందుకున్న ఎన్టీఆర్, శ్రీదేవి ఆ తర్వాత హిట్ ఫెయిర్‌గా నిలిచారు. వరుసగా నాలుగేళ్ల పాటు వెండితెరపై ఈ జంట కనిపిస్తే చాలు అభిమానులకు పండుగే. బాలనటిగా నటించిన హీరోతోనే.. హీరోయిన్‌గా నటించి మెప్పించిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి. 
 
ఎన్టీఆర్ తర్వాత అక్కినేని నాగేశ్వరరావుతో జోడీగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఏయన్నార్‌ 'ప్రేమాభిషేకం', 'బంగారు కానుక', 'శ్రీరంగనీతులు' వంటి సినిమాలు టాలీవుడ్‌లో ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోతాయి. ఆ జనరేషన్‌లో అగ్ర హీరోలు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలందరితో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు. 
 
ఎన్టీఆర్ - ఏయన్నార్ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌తోనూ సూపర్ జోడి అనిపించుకున్నారు. చిరంజీవికి జోడిగా 'రాణీకాసుల రంగమ్మ', 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'ఎస్పీ పరుశురాం' వంటి తెలుగు సినిమాల్లో నటించారు. 'ఆఖరి పోరాటం', 'గోవిందా గోవిందా' లాంటి సినిమాల్లో నాగార్జునతో.. 'క్షణ క్షణం' సినిమాలో వెంకటేష్‍తో నటించారు. 
 
ఓవైపు టాలీవుడ్ లోనూ మంచి అవకాశాలు కొనసాగుతుండగానే…  బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా తన హవాను కొనసాగించింది. 1975లో "జూలీ" సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన శ్రీదేవికి "హిమ్మత్ వాలా" సినిమా తొలి బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. ఈ చిత్రం తర్వాత బాలీవుడ్ హీరోలకు శ్రీదేవి హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు. ఆ తర్వాత వరుస విజయాలతో భారతీయ వెండితెర రారాణిగా వెలుగొందారు. 
 
బాలీవుడ్ లో నెంబర్ 1 స్థాయికి ఎదిగిన తర్వాత టాలీవుడ్‌లో దూరమయ్యారు. 250కిపైగా సినిమాల్లో నటించిన ఆమె.. భారతీయ అగ్రనటులందరితోనూ నటించారు. తెలుగులో 85, తమిళంలో 72, మళయాలంలో 26, హిందీలో 71 సినిమాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 
 
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో వివాహం తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత "ఇంగ్లీష్ వింగ్లీష్" సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. అన్నాళ్లకు సిల్వర్ స్క్రీన్‌పై కనపించినా తన అందంలో కానీ, అభినయంతో ఏ మాత్రం తగ్గలేదు. శ్రీదేవి కెరీర్‌లో 'మామ్' సినిమా చివరిది. జీరో అనే మూవీ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 
 
శ్రీదేవి మరణంతో దేశంలోని సినీ పరిశ్రమ మూగబోయింది. 54 ఏళ్ల వయస్సులోనే గుండెపోటుతో చనిపోవటాన్ని సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతుంది. ఇలాంటి ఓ రోజు వస్తుందని ఊహించలేదంటూ అందరూ కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. సిని ఇండస్ట్రీకి ఇది చీకటి రోజు అంటున్నారు. తమిళం, మలయాళం, తెలుగు, హిందీ సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్‌గా వెలుగొందారు. ఫస్ట్ టైం ఇండియన్ సూపర్ స్టార్, ఎవర్ గ్రీన్‌గా తన ప్రస్థానం కొనసాగించిన ఏకైక నటి శ్రీదేవి ఒక్కరే. పద్మశ్రీ పురస్కారంతో పాటు 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఆమె సొంతం అయ్యాయి.