పట్టాలెక్కనున్న రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు : పది భాగాలుగా 'మహాభారతం'
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన కలల ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. మహాభారతాన్ని ఆయన పది భాగాలుగా నిర్మించాలన్న ఆలోచనలో ఉన్నారు. తాజాగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు, 'మహాభారతం' తాను తీస్తే బహుశా పది భాగాలు ఉంటుందేమోనని అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళిని ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ 'తంలో మీరు 'మహాభారతం' తీస్తానని అన్నారు. అద్భుతమైన ఆ దృశ్య కావ్యం టెలివిజన్లో 266 ఎపిసోడ్స్ ప్రసారమైంది. మీరు తీయాలనుకుంటే ఎన్ని భాగాలుగా తీస్తారు' అని ప్రశ్నించారు. ఇందుకు రాజమౌళి సమాధానం ఇస్తూ 'నాకు కూడా తెలియదండీ. ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఒకవేళ 'మహాభారతం' తీయాలంటే భారతదేశంలో అందుబాటులో ఉన్న అన్ని వెర్షన్స్ చదవాలంటేనే ఏడాదిపైనే సమయం పట్టవచ్చు. అప్పటికి ఒక్క అక్షరం కూడా పేపరుపై పెట్టలేకపోవచ్చు. చాలా పెద్ద ప్రాజెక్టు. 'మహాభారతం' తీస్తే పది భాగాలు తీయాల్సి వస్తుందేమోనని నేను ఊహిస్తున్నా. అయితే, ఎన్ని భాగాలు అవుతుందో కచ్చితంగా చెప్పలేను' అని అన్నారు.