శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (13:32 IST)

రాజమౌళికి అరుదైన గౌరవం.. ప్రభావశీలుర జాబితాలో చోటు - అలియా ప్రశంసలు

alia bhatt
తన దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎస్ఎస్ రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. తన ప్రతిభతో విమర్శకుల నుంచి సైతం ఆయన అభినందనలు అందుకున్నారు. తాజాగా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన టాప్-100 మంది ప్రపంచ వ్యాప్త ప్రభావశీలుర జాబితాలో ఆయనకు చోటుదక్కింది. ఇందులో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌‌కు కూడా చోటుదక్కింది. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన అలియా భట్ కూడా రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. 
 
'మొదటి సారి రాజమౌళిని 'బాహుబలి' ప్రీమియర్‌లో కలిశాను. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఆశ్చర్యపోయాను. ఎలాగైనా ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకున్నా. 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో నా కోరిక తీరింది. ఆయన దగ్గర పనిచేయడం అంటే స్కూల్‌కు వెళ్లడంతో సమానం. ఎన్నో మంచి విషయాలు, కొత్త అంశాలు నేర్చుకోవచ్చు. నేను ఆయనను మాస్టర్‌ స్టోరీ టెల్లర్‌ అని పిలుస్తాను. ఒక కథను అద్భుతంగా తెరకెక్కించగలరు. తన సినిమాల ద్వారా అందరినీ ఒక చోటికి చేర్చుతారు. నటనపరంగా నాకు ఏదైనా సలహా ఇవ్వాలని కోరగా.. ఏ క్యారెక్టర్‌లో నటించినా.. దానిని ప్రేమతో చేయాలని ఆయన చెప్పారు. సినిమా ప్రేక్షకాదరణ పొందకపోయినా.. మనం చేసిన పాత్ర జనాలకు గుర్తుండిపోయేలా నటించాలన్నారు' అని చెబుతూ రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు.