శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (13:48 IST)

'సైరా'కు నై అంటున్న ఉయ్యాలవాడ వంశీకులు.. ఎందుకు?

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బ్రిటీష్ సైన్యాన్ని గడగడలాడించిన ధీరుడ

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బ్రిటీష్ సైన్యాన్ని గడగడలాడించిన ధీరుడు. ఈ పోరాటయోధుడి జీవితకథను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సొంత బ్యానర్‌ కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో తండ్రి మెగాస్టార్ చిరంజీవిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చూపిస్తున్నారు.
 
'సైరా నరసింహా రెడ్డి' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అడపాదడపా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం ఉయ్యాలవాడ వంశీకుల నుంచి నిరసన ఎదురవుతోంది. తమ వంశ పురుషుడి వీరోచిత గాథను తెరకెక్కిస్తూ.. నామమాత్రంగానైనా తమను గుర్తించకపోవడంపై ఉయ్యాలవాడ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
'మా రక్తాన్ని తీసుకువెళుతున్నారు. ఆ గుర్తింపు మాకు దక్కడం లేదు. అదే మా ఆవేదన. మా చరిత్రను సినిమా తీస్తున్నందుకు బాధ లేదు. మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కర్నూల్ నుంచి హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నామని.. చిరంజీవిగానీ, నిర్మాత రాంచరణ్ తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చిరంజీవి వస్తారు.. మాట్లాడతారు అంటూ ఆశపెట్టి వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారని అన్నారు. 
 
మరోవైవు, 'సైరా నరసింహారెడ్డి' సినిమా సెట్టింగును కూల్చివేసిన ఘటనలో వివాదం ముదురుతోంది. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా సెట్ వేసినందుకు కూల్చివేశామని అధికారులు చెబుతుండగా, ఆ స్థలానికి సంబంధించి తాము ఓ ప్రైవేట్ వ్యక్తి నుంచి అనుమతి తీసుకున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇది ప్రభుత్వ స్థలమైతే ప్రైవేటు వ్యక్తుల వద్ద అనుమతి ఎలా తీసుకుంటారంటూ అధికారులు వాదిస్తున్నారు.
 
ప్రస్తుతం కూల్చివేసిన సెట్ రాంచరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాకు వేసినది. ఇందులోనే 'సైరా' షూటింగ్ చేస్తున్నారు. హైదరాబాదు శివారు శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ గుట్టలబేగంపేట ప్రాంతంలో ఈ సెట్ వేశారు. తాజాగా 'సైరా' సినిమాను కూడా అదే సెట్లో చిత్రీకరిస్తున్నారు. దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. పలుమార్లు కోరినా స్పందించకపోవడంతో మంగళవారం సెట్‌ను బుల్డోజర్ సాయంతో కూల్చివేశారు.
 
ఈ ఘటనపై తహసీల్దార్ తిరుపతిరావు మాట్లాడుతూ సెట్టింగ్ తొలగించి ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని తాను స్వయంగా పలుమార్లు సూచించినప్పటికీ చిత్ర యూనిట్ లక్ష్య పెట్టలేదని తెలిపారు. కలెక్టర్ అనుమతితో షూటింగ్ చేసుకుని ఉంటే తమకు అభ్యంతరం ఉండేది కాదన్నారు. ప్రభుత్వ స్థలానికి ప్రైవేట్ వ్యక్తి నుంచి అనుమతి తీసుకున్నామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇది పరోక్షంగా భూకబ్జాకు ప్రోత్సహించడమే అవుతుందని, అందుకనే సెట్‌ను పాక్షికంగా కూల్చివేసినట్టు తిరుపతిరావు వివరించారు.