తారకరత్న వైద్యం కోసం బెంగుళూరుకు విదేశాల నుంచి వైద్యులు
ఇటీవల చిత్తూరు జిల్లా కుప్పంలో తీవ్ర అనారోగ్యానికిగురై బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో తారకరత్నకు వైద్యం చేయించేందుకు విదేశాల నుంచి వైద్యులను రప్పించారు. జనవరి నెలాఖరు నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు వైద్యం చేయించేందుకు విదేశాల నుంచి వైద్యులను రప్పించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. విదేశీ వైద్యులను రప్పించి చికిత్స అందిస్తున్నట్టు వారు వెల్లడించారు. హృద్రోగంతోపాటు నాడీ సమస్యలకు వారు చికిత్స చేస్తున్నట్టు తెలిపారు.
కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గత నెల 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. ఇందులో పాల్గొనేందుకు కుప్పం వెళ్లిన తారకరత్నకు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఆయనకు తొలుత కుప్పం ఆస్పత్రిలోనూ ప్రాథమిక వైద్యం అందించి ఆ తర్వాత బెంగుళూరుకు తరలించారు.
గత 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా విదేశాల నుంచి వైద్యులను రప్పించినట్టు తారకరత్న కుటుంబ సభ్యులు వెల్లడించారు.