మంచు విష్ణు - మనోజ్‌ల మధ్య "వార్" - ఇదేమంత పెద్ద విషయం కాదంటున్న విష్ణు
సీనియర్ నటుడు మోహన్ బాబు ఇద్దరు కుమారులైన తెలుగు హీరోలు మంచు విష్ణు, మంచు మనోజ్‌ల మధ్య ఉన్న విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోతో బహిర్గతమయ్యాయి. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో మంచు విష్ణు స్పందించారు ఈ ఘటన గురువారం ఉదయం జరిగిందన్నారు.
ఇదేమంత పెద్ద గొడవ కాదన్నారు. మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయం అని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. సారథి తనతో వాగ్వాదం పెట్టుకుంటే మనోజ్ ఈ వాగ్వాదాన్ని ఆపలేకపోయారని వివరించారు. మనోజ్ చిన్నవాడు కనుక ఏదో కోపంలో ఆ వీడియోను పోస్ట్ చేసి ఉంటారని, దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంచు విష్ణు అన్నారు.
కాగా, ఎంతో సన్నిహితంగా ఉండే సోదరులు మంచు విష్ణు, మంచు మనోజ్‌ల మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్నట్టు తెలుస్తోంది. అయితే మంచు మనోజ్ ఒక వీడియోను ఫేస్‌బుక్‌లో పెట్టడంతో వివాదమైంది. మంచు కుటుంబానికి సన్నిహితంగా సారథి అనే వ్యక్తి వల్లే ఈ విభేదాలు పొడచూపినట్టు సమాచారం.
ప్రస్తుతం అతను మనోజ్ వద్ద ఉంటున్నట్లు బయటపడింది. దాంతో సారథి అనే వ్యక్తి ఇంటి వద్దకు వచ్చి అతనిని నిలదీసేందుకు విష్ణు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే విష్ణును ఇద్దరు వ్యక్తులు వారిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అదేసందర్భంలో ఇలా మీదకు వెళ్లి బంధువులను, మావారిని కొడుతుంటారంటూ వీడియో బ్యాక్ డ్రాప్‌లో మనోజ్ మాటలు వినిపిస్తాయి.
నిజానికి వీరిద్దరి మధ్య చాలా కాలంగానే విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మనోజ్ ఒక వీడియోను పోస్ట్ చేయడం ద్వారా వారి మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మంచు విష్ణుతో పాటే మోహన్ బాబు ఉంటున్నారు. ఇటీవల మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంలో మనోజ్ వచ్చినప్పటికీ తండ్రి వద్ద విష్ణు ఉండటంతో అటువైపు వెళ్ళలేకపోయాడు.
మోహన్ బాబు తన వద్దకు రమ్మని పిలిచినా మనోజ్ వెళ్లలేదనీ సమాచారం. మనోజ్ పెళ్లి సందర్భంగా మంచు విష్ణు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నదమ్ముల మధ్య ఈ స్థాయిలో విభేదాలకు కారణం ఏమిటనే అంశం బయటపడలేదు. సారథి అనే వ్యక్తి మోహన్ బాబుకు వరుసకు తమ్ముడు.
విష్ణు సినిమా కెరియర్ ప్రారంభమైనప్పటి నుంచి మోహన్ బాబుకు విష్ణుకు సారథి అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. అయితే ఒక్కసారిగా సారథి మంచు మనోజ్‌కు సన్నిహితంగా ఉంటున్నారు. సారథి అనే వ్యక్తి ప్రస్తుతం అన్నదమ్ముల వివాదానికి కారణమయ్యారా? అన్న చర్చ జరుగుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంచు విష్ణు వీడియోపై తండ్రి మోహన్ బాబు సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాకు ఎందుకు ఎక్కారంటూ కొడుకులు ఇద్దరిపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంచు మనోజ్‌కు ఫోన్ చేసి వెంటనే ఆ వీడియో డిలీట్ చేయాలని ఆదేశించారు.
దీంతో ఆ వీడియోను మంచు మనోజ్ డిలీట్ చేశారు. మరోవైపు, అన్నదమ్ముల మధ్య సఖ్యత కుదుర్చేందుకు మంచు లక్ష్మి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద అన్నదమ్ముల వివాదం ఫిలింనగర్‌లో సరికొత్త చర్చకు దారితీసింది.