సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2020 (10:31 IST)

ఏసీ లేని హాలులో ముక్కూమూతికి మాస్క్‌తో సినిమా చూడాలా? నాకు ధైర్యం లేదు : సురేష్ బాబు

ప్రస్తుత పరిస్థితుల్లో తనకు నటీనటులతో పాటు.. సాంకేతిక సిబ్బంది, లైట్ బాయ్ వరకు ప్రతి ఒక్కరి ఆరోగ్యమే ముఖ్యమని, వారి ఆరోగ్యానికి తాను గ్యారెంటీ ఇవ్వలేదని టాలీవుడ్ బడా నిర్మాత డి సురేష్ బాబు చెప్పుకొచ్చారు. పైగా, ఓ సినిమా షూటింగ్ సెట్‌లో ఉన్నవారందరినీ కాపాడగలనన్న నమ్మకం తనకు లేదని ఆయన చెప్పుకొచ్చారు. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, షూటింగ్స్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా, తన సినిమాలు మాత్రం ఇంకో రెండు, మూడు నెలల పాటు ప్రారంభంకాబోవని ఆయన తేల్చి చెప్పారు. తన బ్యానర్ లో తీస్తున్న చిత్రానికి సంబంధించి 27 రోజుల షూటింగ్ ఉందని, అన్నీ యాక్షన్ సీన్లేనని, దాదాపు 100 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు షూటింగ్ స్పాట్‌లో 150 మంది వరకూ ఉండాల్సి వుంటుందని వెల్లడించారు. అంతమంది ఒకే చోట భౌతికదూరం లేకుండా, మాస్క్‌లు లేకుండా షూటింగులో పాల్గొనడం ప్రస్తుతం సాధ్యం కాదన్నారు. రహదారులపై కూడా 30 శాతం మంది మాస్క్‌లను ధరించడం లేదని ఆయన గుర్తుచేశారు. 
 
ఒకవేళ సినిమా పూర్తయినా, తన ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి తానే థియేటర్‌కు వెళ్లబోనని, అటువంటిది ఇప్పుడు షూటింగ్స్ ఎందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇప్పట్లో తాను థియేటరులో సినిమాను చూడబోనని, ఏసీతో పూర్తి మూసివుంచబడే హాల్‌లో ముక్కుకు, మూతికి మాస్క్ కట్టుకుని, నవ్వొస్తే నవ్వకుండా ఎలా ఉండగలమని, అటువంటప్పుడు సినిమాను ఆస్వాదించలేమని ఆయన అన్నారు. 
 
సినీ కార్మికుల ఉపాధి కోసం షూటింగ్స్ చేయడం మంచిదేనని, ఇదేసమయంలో దాన్ని హ్యాండిల్ ఎవరు చేయాలి? ఎలా చేయాలన్నదే సమాధానం లేని ప్రశ్నలని సురేశ్ బాబు వ్యాఖ్యానించారు. టీవీ షూటింగ్స్ జరుగుతున్నాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, వాళ్లు ఓ రోజు షూట్ చేసి అమ్మితే, ఓ 50 వేల రూపాయల లాభం వస్తుందన్న గ్యారంటీ ఉంటుందని, కానీ సినిమా వాళ్లకు ఆ గ్యారంటీ లేదన్నారు. 
 
ఉపాధి కోసమే ఎస్పీ బాలసుబ్రహ్మణం టీవీ షోలు చేస్తున్నారని, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కరోనా సోకి ఆయన ప్రాణాపాయ స్థితి వరకూ వెళ్లి, అదృష్టవశాత్తూ బయటపడ్డారని, లేకుంటే పరిశ్రమకు ఎంతో నష్టం వాటిల్లేదని సురేశ్ బాబు వ్యాఖ్యానించారు. ధైర్యం ఉన్నవారు షూటింగ్స్ చేసుకోవచ్చని, తనకు మాత్రం ఆ ధైర్యం లేదని సురేశ్ బాబు తేల్చి చెప్పారు.