ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (07:18 IST)

కేబీఆర్ పార్కులో లైంగిక దాడికే యత్నించాడు.. నటి చౌరాసియా

హైదరాబాద్‌‌ నగరంలోని కేబీఆర్ పార్కులో ఈ నెల 14వ తేదీన తనపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలను నటి షాలు చౌరాసియా వెల్లడించారు. ఆ దుండుగుడు తనపై లైంగికదాడికి యత్నించాడని ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, తాను గత మూడు సంవత్సరాలుగా సాయంత్రం వేళ వాకింగ్ కోసం కేబీఆర్ పార్క్‌కు వెళ్తున్నానన్నారు. అలాగే, ఈ నెల 14న కూడా వెళ్లానని, రాత్రి 8 గంటల సమయంలో తిరిగి పార్క్ చేసిన కారు వద్దకు వస్తుండగా వెనకనుంచి వచ్చిన ఓ వ్యక్తి తనపై దాడిచేశాడని చెప్పారు.
 
తన రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకుని డబ్బుల కోసం డిమాండ్ చేశాడని చెప్పారు. విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూ అరవడంతో తన ముఖంపై పిడిగుద్దులు కురిపించాడని చెప్పారు. 
 
తన వద్ద నగదు లేదని, నంబరు చెబితే ఫోన్‌ పే చేస్తానని చెప్పానని, అతడు నంబరు చెప్పేందుకు తడబడడంతో తాను 100కు డయల్ చేసేందుకు ప్రయత్నించానన్నారు. గమనించిన అతడు తన ఫోన్ లాక్కుని పక్కనే ఉన్న బండరాయిపైకి తోసి తన తలను బలంగా బాదాడని, దీంతో స్పృహ కోల్పోయినట్టు చెప్పారు.
 
ఆ తర్వాత అతను తనపై లైంగిక దాడికి యత్నించినట్టు చెప్పారు. అదేసమయంలో స్పృహ రావడంతో ప్రతిఘటించినట్టు తెలిపారు. దీంతో అతడు తనపై బండరాయి విసిరాడని, దాని నుంచి తప్పించుకున్నట్టు పేర్కొన్నారు. 
 
దుండగుడు తనను చంపి నిప్పు పెడతానని బెదిరించాడని, తను అతి కష్టం మీద పార్క్ ఫెన్సింగ్ ఎక్కి తప్పించుకున్నట్టు నటి షాలు చౌరాసియా వివరించారు. ఎంతో మంది వీవీఐపీలు పార్కింగ్ చేసే ఈ ప్రదేశంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆమె చెప్పుకొచ్చారు.